టైమ్ బాగుంటే ఇలాగే ఉంటది మరి!

Update: 2022-01-29 07:01 GMT
తెలుగు .. తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ ఉంది .. మంచి మార్కెట్ ఉంది. సూర్య తన కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి గ్యాప్ రాకుండా ముందుకు వెళుతున్నాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, నిర్మాతగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు. బయట సినిమాలకి సంబంధించిన ఎంత మాత్రం గ్యాప్ వస్తోందనిపించినా, వెంటనే తన బ్యానర్లో ఒక సినిమా చేసేయడం ఆయన తెలివి తేటలకు నిదర్శనం. తన సినిమా ఫ్లాప్ అయినా .. హిట్ అయినా అదే ఉత్సాహంతో మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లిపోవడం ఆయనకి అలవాటు.

అయితే జయాపజయాలను గురించి పట్టించుకోకుండా సూర్య వరుస సినిమాలతో ముందుకు వెళ్లడంపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. కథల విషయంలో పెద్దగా దృష్టిపెట్టకుండా ఆయన అలా ముందుకు వెళుతుండటం వలన పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయంటూ అభిమానులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొత్తదనం కోసం ఆయన ప్రయత్నించకపోతే కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అప్పుడు సూర్య కాస్త ఆలోచన చేసినవాడిలా కనిపిస్తాడు. 'సెవెంత్ సెన్స్' .. '24' వంటి విభిన్నమైన కథలతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అలా ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన 'జై భీమ్' ప్రశంసలను అందుకుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించిన ఈ రెండు సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలను గురించి అంతా మాట్లాడుకున్నారు. వాస్తవ సంఘటనలను తీసుకుని సూర్య చేసిన ప్రయత్నాన్ని అందరూ కూడా అభినందించారు. అలాంటి సూర్య తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఇతరుక్కుమ్ తుణీనందవన్' సిద్ధమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'వాడి వాసల్' ను పట్టాలెక్కించాడు. వెట్రి మారన్ దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. టైటిల్ పరంగా .. ఫస్టు పోస్టర్ పరంగా సూర్య అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. ఇక ఆ తరువాత ప్రాజెక్టుల కోసం ఆయన 'సుధ కొంగరకు .. శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ ఏడాది తన బ్యానర్లో నిర్మించడం కోసం ఆయన నాలుగైదు కథలను లాక్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సూర్య టైమ్ బాగుంది .. ఇక ఆయన ఆగడం .. ఆయనను ఆపడం రెండూ కష్టమే!
Tags:    

Similar News