ఈడీ ముందు హాజరైన రియా చక్రవర్తి...!

Update: 2020-08-07 09:30 GMT
యువ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈడీ ముందు హాజరైంది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద రియాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆగస్టు 7న తమముందు హాజరు కావాలని ఈడీ రియాకు సమన్లు జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన రియా చక్రవర్తి.. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ పై వాదనలు జరుగుతున్నాయని.. కోర్టులో తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడాన్ని వాయిదా వేయాలని ఈడీని కోరింది. అయితే రియా చక్రవర్తి చేసిన అభ్యర్థనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తిరస్కరించింది. రియా చక్రవర్తి కోసం ఈ రోజు ఉదయం 11.30 వరకూ వేచిచూస్తామని.. అప్పటికీ ఆమె హాజరుకాని పక్షంలో మళ్లీ సమన్లు జారీ చేస్తామని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి ఈ రోజు ముంబైలో ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు.

కాగా ఈడీ రియాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. సుశాంత్ సింగ్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీకి సమన్లు పంపిన ఈడీ నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా కోరింది. ఆమెతో పాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా నోటీసులు పంపిన ఈడీ రేపటిలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ ఇప్పటికే సుశాంత్ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్స్ తో పాటు అతనికి చెందిన రెండు కంపెనీల వివరాలు కూడా సేకరించిందని సమాచారం. ఇక బీహార్ పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నివేదిక పరిశీలించిన సీబీఐ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News