'మీ టూ' ఆరోపణలకు ఆ హీరో బదులిచ్చాడు

Update: 2018-10-19 09:55 GMT
‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్లో చాలామంది ప్రముఖులకు గట్టిగానే సెగ తాకుతోంది. నానా పటేకర్ లాంటి సీనియర్ నటులతో పాటు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి యువ నటులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటుడిగానే కాక వ్యక్తిగతంగానూ మంచి ఇమేజ్ ఉన్న సుశాంత్‌ సింగ్‌ మీద సంజన అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనానికి దారి తీసింది. సుశాంత్ హీరోగా నటిస్తున్న ‘కిజీ ఔర్‌ మ్యానీ’లో సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న సంజన.. అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. వేధించాడని ఆరోపించింది. ఐతే ఈ ఆరోపణలపై సుశాంత్ వెంటనే స్పందించాడు. అసలు ఈ సినిమా సెట్స్‌ లో ఏం జరిగిందో.. తమ మధ్య ఫోన్ సంభాషణ ఎలా నడిచిందో అతను వివరించాడు. సంజనకు.. తనకు మధ్య జరిగిన ఫోన్ ఛాటింగ్ మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి అతను ట్విట్టర్లో షేర్ చేశాడు.

ఈ విషయమై అతను మరింత వివరణ ఇస్తూ.. ‘‘కొందరు కావాలని చేస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి నాకు నేను మద్దతిచ్చుకోక తప్పలేదు. కొందరు ‘మీ టూ’ పేరుతో నడుస్తున్న మంచి ఉద్యమాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అందుకే నాకు, సంజనకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ మొత్తం ట్విటర్‌ లో పెడుతున్నాను. సినిమా చిత్రీకరణ మొదలైన రోజు నుంచి చివరి రోజు వరకు మా మధ్య సంభాషణ ఎలా సాగిందో చూడండి. ఇప్పుడు ఒక నిర్ణయానికి రావాల్సింది మీరే. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇలా జనాలతో పంచుకోవడం తప్పని తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు మరో మార్గం కనిపించలేదు’’ అని సుశాంత్ చెప్పాడు. సుశాంత్ బయట పెట్టిన ఫోన్ ఛాటింగ్ చూస్తే మాత్రం అతడిదేమీ తప్పు లేనట్లే కనిపిస్తోంది. సినిమా షూటింగుకి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి. మరి సుశాంత్ దాచిపెట్టిన విషయాలేమైనా ఉన్నాయా.. ఆ సినిమా సెట్లో ఏం జరిగింది అన్నది సంజనక.. చిత్ర వర్గాలకే తెలియాలి. మరోవైపు తన ట్విట్టర్ అకౌంటుకి వెరిఫైడ్ మార్క్ సెప్టెంబరు నుంచి కనిపించడం లేదని.. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు తన పేరు వాడుకోవాలని చూస్తున్నారని సుశాంత్ అన్నాడు.
Tags:    

Similar News