ఈ సినిమా హిట్ అని చెప్పుకోవడానికి కారణం మణిశర్మనే!

Update: 2022-09-15 04:13 GMT
ఎస్వీ కృష్ణారెడ్డి అనగానే దర్శకుడిగా ఆయన అందించిన సూపర్ హిట్లు కళ్లముందు కదలాడతాయి. ఇక హీరోగా కూడా ఆయన వెండితెరపై మెరిశారు. ఒక దర్శకుడు ..  సంగీత దర్శకుడిగా కూడా విజయాలను అందుకోవడం చాలా అరుదు. అలాంటి ప్రయోగాలను కూడా చేసి ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ మనసులో నిలిచిపోయారు. కొంతకాలంగా మెగాఫోన్ కి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన, ఇటీవల కాలంలో నటనపై దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.

తాజాగా  ఆయన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో, హీరోయిన్ సంజనకి తండ్రి పాత్రను పోషించారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో హీరోగా చేసిన కిరణ్ అబ్బవరం .. నా కూతురుగా చేసిన సంజన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దివ్యగారు. ఏ రోజున ఏ సమస్యను ఎవరి దగ్గరికి తీసుకుని రాకుండా, తనకి తానుగా పని చేసుకుంటూ వెళ్లిపోయారు. అంతకంటే మంచి నిర్మాత ఎవరికి దొరుకుతారు చెప్పండి.

ఇది కోడి రామకృష్ణగారి బ్యానర్. వారి బ్యానర్ లో చేసే అవకాశం వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు .. అదే పని నేను చేశాను. ఒక పక్క నుంచి దివ్యగారు .. మరో పక్క నుంచి కిరణ్ అబ్బవరం గారు .. పై నుంచి కోడి రామకృష్ణగారు .. అలాంటప్పుడు నేను ఈ సినిమా చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి?  అది హీరోయిన్ ఫాదర్ పాత్ర అయినా  .. మరో పాత్ర అయినా చేస్తాను. ఇక ఈ సినిమాకి మణిశర్మ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ రోజున ఈ సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని మనమంతా ఇంత నమ్మకంగా చెప్పుకోవడానికి  కారణం మణిశర్మగారి సంగీతం.

ఇక్కడికి వచ్చిన తరువాత .. మణిశర్మగారి సంగీతం విన్న తరువాత నాలో ఉత్సాహం పెరిగింది. అద్భుతాలు క్రియేట్ చేయడంలో మణిశర్మగారు ముందే ఉంటారు. ఇక ఈ సినిమా టైటిల్ కి తగినట్టుగా నాకు బాగా కావాల్సినవారు ఎవరు? అని అడుగుతున్నారు.

ఎవరైతే మన కష్టాన్ని కాచుకుంటారో .. ఎవరైతే మన ఇష్టాలను దోచుకుంటారో .. ఎవరైతే మన  ఆత్మకి దగ్గరగా ఉంటారో వారే నాకు బాగా కావాల్సినవారు .. అలా ఉండేది ఎవరో కాదు .. నా ఫ్రెండ్ అచ్చిరెడ్డి గారు" అంటూ ముగించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News