బీదర్‌ నుండి ఒట్టి చేతులతో 'సైరా' టీం

Update: 2019-02-25 06:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం కోసం పడుతున్న కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీన్‌ ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, జాగ్రత్తగా షూటింగ్‌ చేస్తున్నారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా చిన్న సీన్‌ ను కూడా రిచ్‌ గా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక సీన్‌ ను బీదర్‌ లో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశాడు. అక్కడ వారం నుండి పది రోజుల పాటు చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అక్కడి అధికారుల నుండి పర్మిషన్‌ కూడా తీసుకోవడం జరిగింది.

తాజాగా చిరంజీవితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా అక్కడకు చేరుకున్నారట. అయితే షూటింగ్‌ మొదలు అయిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని షూటింగ్‌ ను అడ్డుకున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ చిన్నపాటి యాక్షన్‌ సీన్‌ ను దర్శకుడు ప్లాన్‌ చేశాడని - నటీనటుల కాస్ట్యూమ్స్‌ మరియు కత్తులను చూసి ఇలాంటి సినిమాల చిత్రీకరణకు తాము ఇక్కడ ఒప్పుకోము అంటూ స్థానికులు అడ్డు చెప్పినట్లుగా తెలుస్తోంది.

అధికారులు మరియు పోలీసులు కూడా సైరా చిత్ర యూనిట్‌ సభ్యులను ఒప్పించి అక్కడ నుండి తిరిగి వచ్చేలా ఒప్పించారట. దాంతో సైరా యూనిట్‌ సభ్యులు బీదర్‌ నుండి ఒట్టి చేతులతో వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. బీదర్‌ లో అనుకున్న సీన్స్‌ ను కోకాపేటలో సెట్టింగ్‌ వేసి షూట్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది.
Tags:    

Similar News