`ఆంగ్ బ్యాక్` సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. మార్షల్ ఆర్ట్స్ ని నెక్ట్స్ లెవల్లో చూపించిన భారీ యాక్షన్ చిత్రాలివి. అప్పట్లో `ఆంగ్ బ్యాక్ 3` చిత్రం తెలుగులోనూ రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో టోనీ ఝా అరివీర భయంకర పోరాటాలు - మెరుపు విన్యాసాలు అస్సలు కళ్లు తిప్పుకోనివ్వవు. కళ్లు మూసి తెరిచే లోపే కుత్తుక మీద తలకాయ ఏమైందో వెతుక్కోవాలి. మత్తగజాల్ని సైతం పరుగులు పెట్టించే మృగరాజు వేగం ఆంగ్ లీలో కనిపిస్తుంది. ఆ వేగాన్ని కానీ - మళ్లీ అలాంటి మార్షల్ విద్యల్ని కానీ హాలీవుడ్ హిస్టరీలోనే చూపించలేదంటే అతిశయోక్తి కాదు. ఆంగ్ బ్యాక్ సిరీస్ సినిమాల వీరాభిమానుల్ని టచ్ చేస్తే చాలు వాటి చరిత్రను పుట్టు పూర్వోత్తరాలు సహా ప్రతిదీ చెప్పేస్తారు. అలాంటి గ్రేట్ మూవీస్ కి స్ఫూర్తిగా ఎందరో అలాంటివి మళ్లీ ప్రయత్నించినా తీయలేకపోయారు.
అయితే ఆంగ్‌బ్యాక్ 3 సిరీస్ ప్రస్థావన ఎందుకు? అంటే ఇదిగో సైరా టీమ్‌ని ఆ సినిమా ఓ రకంగా ఇన్ స్పిరేషన్ చేసిందనే ఇదిగో ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. `సైరా - నరసింహారెడ్డి` టీజర్ రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో చిరంజీవి వెనక్కి తిరిగి ఉన్న ఫోటో ఇది. ఇందులో వెనక భాగంలో వీరాధివీరుడి వీరఖడ్గం .. దాంతో పాటే మాసిన గిరజాల జుత్తు ... ముడివేసిన పిలక.. హైలైట్ గా కనిపిస్తున్నాయ్. ఈ రూపం టోనీ ఝా వెనక్కి తిరిగినప్పటి రూపంలా ఉంది. ఆంగ్ బ్యాక్ 3 చిత్రంలో టీనేజీ కుర్రాడు అయిన ఆంగ్ లీని ఓ ముసళ్ల గొయ్యిలోకి తోసేసి పోరాడమని పనిష్ చేస్తారు. ఆ పోరాటంలో అతడు ముసళ్లను మట్టి కరిపించేందుకు వేసే ఎత్తుగడ నభూతోనభవిష్యతి. అలాంటి టెక్నిక్ లు - లాజిక్కులు - జిమ్మిక్కులతో `సైరా- నరసింహారెడ్డి` వీరత్వాన్ని చూపిస్తారేమో అన్న అంచనాలేర్పడుతున్నాయి. అన్నట్టు రేపటి ఉదయం 11.30 సైరా టీజర్ ట్రీట్ మెగాభిమానులకు ఉండనే ఉంది. ఆ టీజర్ చూశాక అసలు ఈ గెటప్ ఏ హాలీవుడ్ సినిమాని పోలి ఉందో కచ్ఛితంగా పోలిక చెబుతారేమో చూడాలి.