విమ‌ర్శ‌ల‌తో మొద‌లై హాలీవుడ్ కు..!

Update: 2022-07-28 08:31 GMT
ఎక్క‌డ విమ‌ర్శించారో అక్క‌డే ప్ర‌శంస‌లు పొందాల‌ని కొంత మంది గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంటారు. ఏ రంగ‌మైతే ప‌నికిరాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించిందో అదే రంగంలో స్టార్ గా ఎద‌గాల‌నుకుంటారు కొంత మంది. అలా ఓ హీరో ఎదిగి చూపించాడు. త‌నని విమ‌ర్శించిన వారి చేతే శ‌భాష్ అనిపించుకున్నాడు అత‌నే త‌మిళ హీరో ధ‌నుష్. ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా చిన్న సినిమాతో మొద‌లైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం హాలీవుడ్ వ‌ర‌కు చేరింది. నేడు హీరో ధ‌నుష్ పుట్టిన రోజు. హీరో అంటే ఆర‌డుగుల అజాను బావుడు.. అంద‌గాడు.. అనే ఓ రూల్ వుంది. కానీ అది త‌ప్ప‌ని.. టాలెంట్ వున్న ప్ర‌తీ వాడూ హీరో కావ‌చ్చ‌ని  నిరూపించాడు.

ప‌ద‌హారేళ్ల వ‌య‌సులోనే హీరోగా తండ్రి కార్తీక్ రాజా ప్రోత్సాహంతో తెరంగేట్రం చేసిన ధ‌నుష్ అస‌లు పేరు వెంక‌టేష్ ప్ర‌భు క‌స్తూరి రాజా. 2002 లో తండ్రి క‌స్తూరి రాజా రూపొందించిన `తుల్లువ‌దో ఇళ్ల‌మై` అనే సినిమాతో న‌టుడిగా ధ‌నుష్ న‌ట ప్ర‌స్థానం మొద‌లైంది. యూత్ ని టార్గెట్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అనిపించుకుంది. అయితే ధ‌నుష్ ని చూసిన వాళ్లంతా హీరో ఏంటీ ఇలా వున్నాడ‌ని దారుణంగా కామెంట్ లు చేశారు. దాంతో ఎలాగైనా ఇక్క‌డే హీరోగా నిల‌బ‌డాల‌ని.. విమ‌ర్శించిన చోటే ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట ధ‌నుష్‌.

మ‌రింత క‌సి పెర‌గ‌డంతో త‌న అన్న‌య్య సెల్వ‌రాఘ‌వ‌న్ డైరెక్ట్ చేసిన‌ `కాద‌ల్ కొండేన్‌`లో న‌టించాడు. విభిన్న‌మైన పాత్ర కావ‌డంతో ధనుష్ కు త‌న టాలెంట్ ఏంటో ఇండ‌స్ట్రీతో పాటు ప్రేక్ష‌కుల‌కు చూపించే అవ‌కాశం ద‌క్కింది. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ మొత్తం ధ‌నుష్ వంక ఆశ్చ‌ర్యంగా చూసింది. అక్క‌డి నుంచి ధ‌నుష్ స‌రికొత్త పాత్ర‌లు, సినిమాల‌తో త‌న‌దైన మార్కు ఎంట‌ర్ టైన్ మెంట్ ని అందిస్తూ వ‌స్తున్నాడు. ఇదే సినిమాని తెలుగులో అల్ల‌రి న‌రేష్ హీరోగా `నేను` అనే పేరుతో రీమేక్ చేశారు.

ఇక ధ‌నుష్ కు రెండ‌వ సినిమాతో పేరు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న‌ అన్న‌య్య, ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్. కొన్ని సంద‌ర్భాల్లో నా నుంచి మంచి న‌ట‌న‌ని రాబ‌ట్ట‌డం కోసం త‌న‌ను న‌న్ను కొట్ట‌డం వ‌ల్లే నేను ఈ రోజు న‌టుడిగా ఈ స్థాయిలో వున్నాన‌ని చెబుతుంటాడు ధ‌నుష్. కెరీర్ ప్రారంభం నుంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే అంద‌రికి భిన్నంగా వెళుతూ కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ని ప్రోత్స‌హిస్తూ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

`ఆడుకాలం`తో జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టుడిగా, `కాక‌ముట్టై`, విసార‌ణై చిత్రాల‌తో ఉత్త‌మ స‌హ నిర్మాత‌గా, `అసుర‌న్‌`తో ఉత్త‌య నటుడిగా అవార్డుల్ని సొంతం చేసుకుని ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. న‌ట‌నే రాత‌ని, హీరో ప‌ర్స‌నాలిటీనే లేద‌ని గేలి చేసిన వాళ్లు త‌న‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోయేలా చేసి ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచాడు. హీరో అంటే రూపం వుంటే స‌రిపోద‌ని టాలెంట్ వుండాల‌ని ఎంతో మందికి రోల్ మోడ‌ల్ అయ్యాడు. ఇన్నేళ్ల త‌న ప్ర‌యాణంలో న‌టుడిగా, గాయ‌కుడిగా, నిర్మాత‌గా త‌న‌దైన మార్కుని చూపించాడు.

`రాంఝానా`తో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చిన ధ‌నుష్ తొలి చిత్రంతో బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అవార్డుని ద‌క్కించుకున్నాడు. ఆ త‌రువాత `ది ఎక్స్ ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ది ఫ‌కీర్‌` మూవీతో హాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యారు. తొలి చిత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా ధ‌నుష్ కు హాలీవుడ్ లో మ‌రో సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని అందించింది. అవెంజ‌ర్స్ సిరీస్ చిత్రాల ద‌ర్శ‌కులు జోయ్ అండ్ ఆంటోనీ రుసో బ్ర‌ద‌ర్స్ రూపొందించిన `ది గ్రే మ్యాన్‌`లో న‌టించాడు.

 ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ సంద‌డి చేస్తోంది. ఇదే ఏడాది `సార్‌` అనే మూవీతో ధ‌నుష్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని ధ‌నుష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బుధ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. గురువారం ఈ మూవీ టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీతో పాటు ధ‌నుష్ తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో ఓ మూవీని చేయ‌నున్న విష‌యం తెలిసిందే
Tags:    

Similar News