'హాఫ్' మార్కును అందుకున్న ట్యాక్సీవాలా

Update: 2018-11-19 10:39 GMT
శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ట్యాక్సీవాలా’పై రిలీజ్ ముంగిట పెద్దగా అంచనాల్లేవు. ఎంతో నెగెటివిటీ మధ్య ఈ చిత్రం రిలీజైంది. కానీ అంచనాల్ని తలకిందులు చేస్తూ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ టాక్ ను సద్వినియోగం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది ఈ చిత్రం. దసరా సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. వచ్చిన సినిమాలన్నీ తుస్సుమంటున్నాయి. దీపావళి టైంలో కూడా నిరాశ తప్పలేదు. గత వీకెండ్లో ముందుగా వచ్చిన భారీ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు సాయంత్రానికే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇలాంటి టైంలో ‘ట్యాక్సీవాలా’ బాక్సాఫీస్ కు ఊపిరి ఇచ్చింది. శని.. ఆది వారాల్లో ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్స్ తో నడిచింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలోనూ ‘ట్యాక్సీవాలా’ జోరు చూపించింది. ‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ చిత్రాల స్థాయిలో ప్రభంజనం సృష్టించలేదు కానీ.. ‘ట్యాక్సీవాలా’ మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈ చిత్రం మంచి వసూళ్లే సాధించినట్లు. ఈ చిత్రం వీకెండ్ అయ్యేసరికే హాఫ్ మిలియన్ మార్కుకు చేరువైంది. పెద్దగా అంచనాల్లేకపోవడం వల్ల ప్రిమియర్లతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. 1.3 లక్షల డాలర్లే వసూలయ్యాయి. కానీ తర్వాతి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. 2 లక్షల డాలర్ల దాకా కలెక్టయ్యాయి. ఆదివారం కూడా స్టడీగానే ఉన్నాయి వసూళ్లు. ఆ రోజుకే హాఫ్ మిలియన్ మార్కుకు చేరువైన ఈ చిత్రం.. సోమవారానికి జరిగిన ప్రి బుకింగ్స్ తో హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసింది. ఫుల్ రన్లో ‘ట్యాక్సీవాలా’ మిలియన్ మార్కుకు చేరువగా వెళ్లేందుకు అవకాశముంది.
Tags:    

Similar News