ఒక్క సినిమా కూడా దాహం తీర్చట్లేదు

Update: 2018-02-24 04:41 GMT
ఈ వారం ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. పెద్ద సినిమా ఏదీ షెడ్యూల్ కాకపోవడం.. ఎగ్జామ్స్ సీజన్ దగ్గర పడ్డం వంటి కారణాలతో చిన్న సినిమాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. శ్రీకాంత్ రా..రా.. విక్రమ్ స్కెచ్.. జువ్వ.. చల్తే చల్తే.. హైద్రాబాద్ లవ్ స్టోరీ అంటూ ఐదు చిత్రాలు ఈ వారంలో రిలీజ్ అయినా.. వీటిలో ఒక్క చిత్రానికి కూడా థియేటర్లను నింపే సత్తా లేకపోయింది.

హారర్ కామెడీలో శ్రీకాంత్ మొదటిసారి నటించడంతో రారా చిత్రం ఆసక్తి కలిగించింది. కానీ కామెడీ పాళ్లు మరీ శృతిమంచి ఇబ్బంది పెట్టే రీతిలో ఉండడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్ గా చెబుతున్నారు ప్రేక్షకులు. హారర్ కామెడీ జోనర్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయారని ఆడియన్స్ అభిప్రాయం.

విక్రమ్ -తమన్నా నటించిన స్కెచ్ అయితే భారీగానే రిలీజ్ అయింది. తమిళ్ లోనే ఫ్లాప్ అయిన ఈ డబ్బింగ్ సినిమాలో.. ఒక్క క్లైమాక్స్ మినహాయిస్తే మిగిలిన ఏ పాయింట్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర పాస్ అయ్యే అవకాశాలు తక్కువే.

రాజమౌళి శిష్యుడు త్రికోఠి తెరకెక్కించిన జువ్వ కూడా ఆసక్తి గలిగించినా.. హీరోయిన్ పై విలన్ విపరీతమైన ప్రేమ పెంచేసుకోవడం.. ఆమె కోసం ఏమైనా చేసేయడం అనే పాయింట్ తప్ప.. మిగిలిన అంశాలేవీ జనాలను మెప్పించలేకపోయాయి.

హైద్రాబాద్ లవ్ స్టోరీ ని రాహుల్ రవీంద్రన్ బాగానే నడిపించినా.. అందుకు తగిన కథా-కథనాలు.. చిత్రీకరణ లోపించాయి. మరోవైపు చల్తే చల్తే అంటూ వచ్చిన మరో లవ్ స్టోరీ కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.

వీటిలో కొన్నిటికి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా.. అందుకు తగ్గ ఔట్ పుట్ మాత్రం కనిపించలేదు. మొత్తం మీద ఒక్క సినిమా కూడా అటు ప్రేక్షకుల దాహం కానీ.. అటు థియేటర్ల దాహం కానీ తీర్చే సత్తా ఉన్న సినిమాగా మిగలలేకపోయింది.
Tags:    

Similar News