తెలుగు హీరోయిన్లా.. వామ్మో!

Update: 2017-03-07 17:30 GMT
తెలుగులో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం ఒకప్పటి మాట. వాళ్లకు ప్రయారిటీ తగ్గిపోయి చాలా కాలమైంది. అందుకు ఎవ్వరినీ నిందించలేం. దర్శక నిర్మాతలకు తెలుగమ్మాయిలంటే చిన్న చూపని అంటారు అవకాశాలు కోరుకునే తెలుగమ్మాయిలు. ఐతే మన సినిమాల డిమాండ్లకు తగ్గట్లుగా ఉండరంటూ తెలుగమ్మాయిల మీద నింద నెట్టేస్తారు ఫిలిం మేకర్స్. కారణాలేవైనా తెలుగమ్మాయిలకు తెలుగు సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదన్నది వాస్తవం. ఐతే అసలే టాలీవుడ్లో తెలుగమ్మాయిల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ మధ్య ఇద్దరు తెలుగు హీరోయిన్లు ఇచ్చిన ఇంటర్వ్యూలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.

మంచి సినిమా చేసి దాన్ని ప్రమోట్ చేయడం కోసం టాలీవుడ్లో చాలామంది హీరోల్ని కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపణలు గుప్పిస్తూ ఇండస్ట్రీలోని మరికొన్ని చీకటి కోణాల్ని కూడా ఒక తెలుగమ్మాయి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పుడు తాజాగా మరో తెలుగమ్మాయి ఇదే తరహా ఇంటర్వ్యూలో బాంబు పేల్చేసింది. ఆమె మరీ ఓపెన్ అయిపోయి.. ఇండస్ట్రీలోని చాలా తెరచాటు వ్యవహారాల గురించి మాట్లాడేసింది. ఈ విషయాలన్నీ ఇండస్ట్రీలో బహిరంగ రహస్యాలే. కానీ ఎవ్వరూ వాటి గురించి ఓపెన్‌ గా మాట్లాడరంతే. ఇక్కడ నెట్టుకు రావాలంటే కొంచెం లౌక్యం అవసరమంటారు. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లు ఉండాలి. అవసరాలకు తగ్గట్లు పని చేసుకుపోవాలన్నది ఇండస్ట్రీలో అనధికారిక రూల్. ఇలాంటి అడ్జస్ట్ మెంట్లు చేసుకోకపోయినా సరే.. వాటి గురించి కనీసం బయట మాట్లాడకూడదు. అది ఎంతమాత్రం ‘ప్రొఫెషనలిజం’ కాదు. ఇలాంటి ‘ప్రొఫెషనలిజం’ తెలియదు కాబట్టే తెలుగమ్మాయిలు మన ఇండస్ట్రీలో వెనుకబడిపోయి ఉన్నారంటారు ఇండస్ట్రీ జనాలు.

ఇంటర్వ్యూలతో సంచలనాలు రేపిన ఇద్దరు హీరోయిన్లు కూడా అవకాశాల్లేవన్న అక్కసుతో ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి.. వార్తల్లో నిలవడానికి ఏదేదో మాట్లాడారని విమర్శించే వాళ్లూ ఇండస్ట్రీలో ఉన్నారు. నిజానికి వాళ్లకు అంతేసి ఇంటర్వ్యూలిచ్చే సీన్ కూడా లేదని.. ఐతే ఏవో సెన్సేషనల్ ముచ్చట్లు చెబితేనే ఇంటర్వ్యూ చేస్తామనే షరతులతో వాళ్లను ఒప్పించి ఇలా వాళ్లతో ఏదేదో మాట్లాడించి క్యాష్ చేసుకునే ప్రయత్నమూ జరిగిందన్న వాదనా ఉంది. ఏదైతేనేం. ఈ ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాల వల్ల ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే మార్పయితే ఏమీ ఉండదు. వీటి వల్ల తెలుగమ్మాయిలకు అవకాశాలు మరింత తగ్గడం తప్ప వారికి ఇంకేరకంగానూ ప్రయోజనం ఏమీ ఉండదన్నది నిష్ఠుర సత్యం అంటున్నారు విశ్లేషకులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News