ఫోకస్‌: తెలుగుదనమే కమ్మదనం

Update: 2015-04-08 11:30 GMT
దేశ భాషలందు తెలుగులెస్స. ప్రపంచంలోనే అత్యంత తీయనైన భాష తెలుగు. తెలుగుదనంలోని ఉంది కమ్మదనం. ఇలాంటి పొగడ్తలకు తక్కువేమీ కాదు కానీ... అసలు మనవాళ్లు సినిమాలు తీస్తే అర్థం పర్థం లేని టైటిల్స్‌తో చంపేస్తున్నారన్న అపవాడు అప్పట్లో ఉండేది. అచ్చ తెలుగు టైటిల్స్‌ పెడితే మీ సొమ్మేం పోతుంది? ఇంగ్లీష్‌ టైటిల్స్‌, హిందీ టైటిల్స్‌ పెడుతూ తెలుగు కల్చర్‌ని నాశనం చేస్తారెందుకు? అంటూ పెద్దాళ్లంతా తిట్టిపోసేవారు.

ఎవరైనా సినీపెద్దలు వేదికలెక్కినప్పుడు తమ ఉపన్యాసాల్లో దంచేసే పాయింటు ఇదే. కానీ ఇప్పుడు సీను మారింది. సీనియర్‌ దర్శకుల బాటలోనే నవతరం దర్శకులు వెళుతన్నారు. అప్పట్లో దాసరి, రామానాయుడు వంటి లెజెండ్స్‌ తెలుగు సినిమాకి తెలుగు పేర్లు పెట్టి తెలుగుదనంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. అయితే ఇవన్నీ నవతరం దర్శకులు, ఇప్పుడొస్తున్న నిర్మాతలంతా దృష్టిలో పెట్టుకుంటున్నారు. టైటిళ్లలో తెలుగుదనం ఎక్కువగానే కనిపిస్తోంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్‌ పెట్టినప్పుడు శ్రీకాంత్‌ అడ్డాలకు విపరీతమైన ప్రశంసలొచ్చాయి. తెలుగుదనం నిండిన టైటిల్‌ పెట్టాడు, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా తీస్తున్నాడు అని ముందే ప్రేక్షకులకు అర్థమైపోయింది. అలాగే తెలుగు లోగిళ్లలో తెలుగుదనం నిండిన టైటిల్స్‌తో పూరీ, ఈవీవీ వంటి దర్శకులు ఆకట్టుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఆ ఒక్కటీ అడక్కు, కత్తి కాంతారావు లాంటి టైటిల్స్‌ తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాలన్నిటికీ తెలుగు టైటిల్స్‌ను, క్లాస్‌ టైటిల్స్‌నే ఎంపిక చేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది' అప్పట్లో చర్చలకు దారితీసింది. క్లాస్‌ టైటిల్‌తో వస్తున్నాడు. కుటుంబమంతా చూసే సినిమా ఇదని జనాలు బ్లైండ్‌గా మైండ్‌లో ఫిక్సయిపోయారు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్టయ్యింది. అలాగే ఇప్పుడు మహేష్‌ హీరోగా నటిస్తున్న సినిమాకి 'శ్రీమంతుడు' అనే టైటిల్‌ పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌-సుకుమార్‌ సినిమాకి 'నాన్నకు.. ప్రేమతో' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. బన్ని-త్రివిక్రమ్‌ సినిమాకి అచ్చతెలుగు కాకపోయినా, పెద్దరికం ఉట్టిపడే టైటిలే పెట్టారు. అలాగే నితిన్‌ హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి 'మా అమ్మ సీతామాలక్ష్మి' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. నిఖిల్‌ నటించే సినిమాకి టైటిల్‌ 'శంకరాభరణం' అనుకుంటున్నారు.

ఇలా టైటిల్స్‌లోనే తెలుగుదనం ఎంతో కమ్మగా వినిపిస్తోంది కదూ.. అది సంగతి!!!

Tags:    

Similar News