వినోదంపై జీఎస్టీ బాదుడు త‌గ్గింపు

Update: 2018-12-22 14:42 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ బాదుడు ప‌ర్య‌వ‌సానం కేవ‌లం అధిక ఆదాయ‌ వ‌ర్గానికే ప‌రిమితం అనుకుంటే పొర‌పాటే. సామాన్యుడి పాలిట అది శాపంగా మారింద‌న్న‌ది నిపుణుల విశ్లేష‌ణ‌. విందు - వినోదం - తిండి - పెట్రోల్ ఒక‌టేమిటి పోటు పొడ‌వాల్సిన ప్ర‌తిచోటా పొడిచేశారు. అందుకే ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యాల‌పై నిర‌స‌న వెల్లువెత్తింది. టిక్కెట్టు ధ‌ర‌కు అద‌న‌పు జీఎస్టీ బాదుడు ఓ ర‌కంగా సినిమాలు చూసేవారి సంఖ్య‌ను త‌గ్గించింది. అలాగే చిన్న సినిమాల పాలిట కూడా అది శాప‌మైంది. సినిమాలు తీసే వాళ్ల సంఖ్య‌ను ఇది త‌గ్గించింది. టిక్కెట్టుపై జీఎస్టీ బాదుడు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ  టాలీవుడ్ - కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.

అయినా కేంద్ర ప్ర‌భుత్వం కానీ - మోదీ కాని దిగి రాలేదు. మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మూడు రాష్ట్రాల్లో భాజ‌పా తుడిచిపెట్టుకుపోయిన క్ర‌మంలోనే జీఎస్టీ బాదుడు ప్ర‌భావం త‌మ‌పై ప‌డింద‌ని గ్ర‌హించి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగుతోంది కేంద్రం. ఆ క్ర‌మంలోనే వినోదంపై ప‌న్ను త‌గ్గింపు నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ.100 అంత‌కుమించిన టిక్కెట్టు ధ‌ర‌పై వ‌సూలు చేస్తున్న 28 శాతం జీఎస్టీని - 10 శాతం త‌గ్గింపుతో 18 శాతానికి త‌గ్గించారు. రూ.100లోపు టిక్కెట్టు రేటుపై 18 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి మ‌దింపు చేశారు.

ఈ నిర్ణ‌యం ఆశావ‌హం. టిక్కెట్టు పై భారం త‌గ్గితే ఆ మేర‌కు టిక్కెట్టు కొనుక్కునే వాళ్లు పెరుగుతారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి - బ‌డుగు జీవికి వినోదం అందుబాటులోకి వ‌స్తుంది. జేబుకు చిల్లు ప‌డిపోదు కాబ‌ట్టి కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ల వైపు మ‌ర‌లేందుకు ఆలోచ‌న పురుడు పోసుకుంటుంది. తాజా జీఎస్టీ నిర్ణ‌యం వినోద రంగం ప‌రంగా ప్ర‌శంసించ‌ద‌గిన‌ది. ఈ డిసెంబ‌ర్ లో ఇప్ప‌టికి అన్ని సినిమాలు రిలీజైపోయిన‌ట్టే. నెలాఖ‌రు అలాగే జ‌న‌వ‌రిలో రిలీజ్ కి రెడీ అవుతున్న టాలీవుడ్ సినిమాల‌తో పాటు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల సినిమాల‌కు లాభం చేకూరిన‌ట్టే. త‌గ్గిన టిక్కెట్టు ధ‌ర‌తో సంక్రాంతి పందెం హుషారుగానే సాగుతుంది. థియేట‌ర్లు క‌ళక‌ళ‌లాడ‌తాయ‌న‌డంలో సందేహం లేదు. జ‌న‌వ‌రి 9న క‌థానాయ‌కుడు, 11న `విన‌య విధేయ రామా` - ఆ త‌ర్వాత `ఎఫ్ 2` - `పేట` వంటి చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. వీట‌న్నిటికీ ఈ త‌గ్గింపు పెద్ద ప్ల‌స్ కానుంది.
Tags:    

Similar News