శోభన్ బాబు తరువాత ఆ క్రేజ్ నాకే వచ్చింది!

Update: 2022-04-02 02:30 GMT
టాలీవుడ్లో యాక్షన్ హీరోలుగా ఎక్కువ మార్కులు కొట్టేసినవారి జాబితాలో సుమన్ ఒకరుగా కనిపిస్తారు. తెలుగు తెరకు మార్షల్ ఆర్ట్స్ ను పరిచయం చేసిన అర్జున్ .. భానుచందర్ .. సుమన్ లలో, సుమన్ స్థానం ప్రత్యేకంగా కనిపిస్తుంది. '20వ శతాబ్దం' .. ' బావా బావమరిది' వంటి సాంఘిక చిత్రాలతో పాటు, 'శ్రీరామదాసు' .. ' అన్నమయ్య' వంటి భక్తి చిత్రాలలోను ఆయన మెప్పించారు. తెరపై తప్ప సినిమా ఫంక్షన్స్ లో కనిపించని సుమన్, తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.

"కెరియర్ ఆరంభంలో నేను తమిళ సినిమాలు చేస్తుండేవాడిని. అక్కడే భానుచందర్ తో నాకు స్నేహం ఏర్పడింది. తెలుగులో హీరోగా రాణిస్తానని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిందే భానుచందర్. అప్పటికి నాకు తెలుగు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. అయినా ఇక్కడ వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాను.

తెలుగులో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో చేసిన 'తరంగిణి' సినిమాతో నాకు ఫస్టు సక్సెస్ వచ్చింది. అలా హీరోగా  ఇక్కడ 100 సినిమాలను పూర్తిచేశాను.

తెలుగు .. తమిళ .. మలయాళ ..  కన్నడ .. హిందీ .. ఒరియా .. భోజ్ పురి .. మరాఠీ .. మొదలైన పది భాషల్లో 600 సినిమాల వరకూ చేశాను. ఈ 44 ఏళ్ల కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలను  చేస్తూ వెళ్లాను. శోభన్ బాబు తరువాత ఇద్దరు హీరోయిన్లతో చేసిన హీరోగానూ .. యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగాను నాకు మంచి పేరు వచ్చింది.

ఎలాంటి  సినిమా నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చిన నేను, ఇంతకాలం ఇండస్ట్రీలో నిలబడటం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరికైనా ఒక టైమ్ ఇచ్చినప్పుడు ఆ టైమ్ కి అక్కడికి వెళ్లవలసిందే అని మా అమ్మ చెప్పింది. ఆ మాటను ఇప్పటికీ పాటిస్తున్నాను. అందువల్ల నే సుమన్ షూటింగుకి లేట్ గా వచ్చాడనే టాక్ ఇంతవరకూ లేదు.

షూటింగుకి ముందే పాత్ర సంబంధమైన నా డౌట్లు క్లియర్ చేసుకుంటాను. సెట్ కి వచ్చిన తరువాత మాత్రం టైమ్ వేస్టు చేయను. నాకు అర్థంకాని డైలాగ్ ఏదైనా ఉంటే దాని గురించి అడుగుతాను తప్ప, మిగతా విషయాలలో కలుగజేసుకోను. సెట్లో నేను అందరితోను ఫ్రెండ్లీగానే ఉంటాను. అలా ఉండటం వల్లనే నా ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలామంది దర్శక నిర్మాతలు నాతో వరుస సినిమాలు చేశారు. నా క్రమశిక్షణ .. నా బిహేవియర్  కూడా నేను ఇంతకాలం ఇండస్ట్రీలో నిలబడటానికి కారణమని నమ్ముతాను అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News