అడ్వాన్సులపై వ‌డ్డీ పెరుగుతున్నా ఎదురు చూపులేనా?

Update: 2022-12-22 09:39 GMT
పెనం మీంచి పొయ్యి లో ప‌డ‌డం అంటే ఇదే!  పాపం తెలిసో తెలియ‌కో తెలిసినా చేసేదేమీ లేక‌నో ర‌క‌ర‌కాల‌ కార‌ణాల‌తో కొంద‌రు నిర్మాత‌లు స్టార్ హీరోల‌తో క‌మిట్ మెంట్లు కుదుర్చుకుంటారు. ఆ త‌ర్వాత ఏళ్ల త‌ర‌బడి ఎదురు  చూస్తారు. భారీ మొత్తంలో అడ్వాన్సులు చెల్లించి ఈ రోజు రేపు అంటూ త‌మ డేట్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఆ డేట్ వ‌చ్చేదెపుడు? అన్న‌ది దేవుడికే ఎరుక‌. దీనిపై ఆశ‌గా ఆస‌క్తిగా ఉత్కంఠ‌గా ఎప్పుడూ డౌట్ ఫుల్ గా ఎదురు చూడ‌టం నిర్మాతల‌ విధి. హీరో డామినేటెడ్ ఇండ‌స్ట్రీ ఇది. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావులాగా బిగ్గ‌ర‌గా గ‌ళం విప్పి దానిని ఖండించేవాళ్లు కూడా క‌రువ‌య్యారు. ఏది ఏమైనా కానీ హీరో సామ్యంలో ఎదురు చూపులు త‌ప్ప చేసేదేమీ లేద‌న్న‌ది క‌ళ్ల ముందున్న న‌గ్న‌స‌త్యం.

ఇటీవ‌ల తెలిసీ తెలియ‌క లేదా అన్నీ తెలిసీ కూడా ఒక స్టార్ హీరో కం రాజ‌కీయ నాయ‌కుడికి కొంద‌రు నిర్మాత‌లు భారీ మొత్తాల్లో అడ్వాన్సులు ఇస్తూ స్వ‌యం తృప్తి పొందుతున్నార‌న్న గుస‌గుస వినిపిస్తోంది. అత‌డు అడ్వాన్స్ తీసుకోవ‌డ‌మే త‌మ‌కు పార్టీ టికెట్ ఇచ్చినంత ఆనందంగా ఫీల‌వుతున్నార‌ట‌. క‌నీసం సినిమా చేయ‌క‌పోతే పోయాడు.. ఏదో ఒక చోట ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయించ‌క‌పోడు! అన్న ఆశ కూడా కొంద‌రిలో ఉండ‌డంతో అడ్వాన్స్ ల సూట్ కేసులు అందించేందుకు ఎంతో ఆత్రంగా కూడా కొంద‌రు వెయిటింగులో ఉన్నారని గుస‌గుస వినిపిస్తోంది. ఇందులో ప‌లువురు ఎన్నారైలు ఉన్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

ఏది ఏమైనా ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌ల ప్ర‌కారం స‌ద‌రు హీరో గారు ఇప్పుడు ఎవ‌రి ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు పెడ‌తారో తెలియ‌డం లేదు! అంటూ ఒక గుస‌గుస వేడెక్కించేస్తోంది. అయితే ఇంత‌లోనే ఓ ఇద్ద‌రు ఫిలింమేక‌ర్స్ కి అత‌డి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది.

కానీ చాలా కాలంగా అడ్వాన్సులు ఇచ్చి చ‌ర్చ‌ల్లో ఉన్న ఇద్ద‌రు నిర్మాత‌ల స‌న్నివేశం మాత్రం ఎటూ కాకుండా ఉంద‌ని తెలిసింది. త‌మ‌కు స‌ద‌రు హీరో కం రాజ‌కీయ నాయ‌కుడు ఎప్పుడు డేట్ కేటాయిస్తాడా? అన్న వెయిటింగ్ త‌ప్ప క‌న్ఫామ్ చేస్తూ చెప్పండి అని అడిగే ధైర్యం కూడా వారిలో లేద‌న్న గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌స్తుతానికి త‌న‌కు ఉన్న రాజ‌కీయ క‌మిట్ మెంట్ల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పదహారు నెలలు మాత్రమే సమయం ఉన్నందున స‌ద‌రు స్టార్ హీరో ఏ  నిర్మాత‌కూ మాట ఇవ్వ‌లేని ప‌రిస్థితి. దీనిని అర్థం చేసుకున్న నిర్మాత‌లు కూడా చాలా ఓపిక చేసుకుని వేచి చూస్తున్నార‌ట‌. ఎవ‌రైనా నిర్మాత‌ను ఆ హీరోతో మీ సినిమా ఎప్పుడు? అని తెలిసిన వారు ప్ర‌శ్నిస్తే.. ఇదిగో అదిగో త్వరలో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. మాలో మేం ఎవ‌రికి వారు సినిమా సెట్స్ కి వెళ‌తామ‌నే అనుకుంటున్నాం. కానీ ఆ డేట్ ఎప్పుడో తెలియ‌డం లేదు! అని కొంద‌రు ఇటీవ‌ల తెలిసిన వారి ముందు వాపోయార‌ట‌.

ఇక్క‌డ హీరోగారికి త‌ప్ప ఎవరికీ ఏమీ తెలియదు.. డేట్ గురించి అడ‌క్కూడ‌దు! అని కూడా చెప్పార‌ట‌.  ప్రతి నిర్మాత నుంచి సుమారు 50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ లు అందుకున్న స‌ద‌రు హీరో రాజ‌కీయ జీవితాన్ని స‌జావుగా కొన‌సాగిస్తూనే సినిమా క‌మిట్ మెంట్ల‌ను నెర‌వేర్చాల్సి ఉంది. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల ముందు ప్ర‌జ‌ల ముందు మాటిచ్చాక త‌ల దించుకునే ప్ర‌స‌క్తే లేని ఆ హీరో నైజానికి మ‌న నిర్మాత‌లే కాస్త ఓపిక ప‌ట్టాల‌ని సూచ‌న‌లు అందుతున్నాయి. ఈ చ‌ద‌రంగంలో విధిని ఎవ‌రూ త‌ప్పించుకోలేరు అన్న‌ది ప‌క్కా వాస్త‌వం!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News