'ఆర్ ఆర్ ఆర్' మేక‌ర్స్‌కి భ‌యం ప‌ట్టుకుంది

Update: 2022-01-07 11:56 GMT
ఇద్ద‌రు క్రేజీ స్టార్ లు తొలి సారి క‌లిసి న‌టించిన భారీ పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్‌.. వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌.. దాదాపు 900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. 20 కోట్లు ప‌బ్లిసిటీకే పెట్టేయ‌డం.. వెర‌సి `ఆర్ ఆర్ ఆర్‌` ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 బాష‌ల్లో విడుద‌ల అన్నారు. ప్రీమియ‌ర్ షోల‌కు టిక్కెట్ లు కూడా అమ్మేశారు... జ‌రుగుతున్న ప‌రిణామాల‌ని చూసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు నిర్మాత దాన‌య్య న‌క్క‌తోక‌ని తొక్కాడు పో.. అని కౌంట‌ర్ లు వేయ‌డం.. క‌ట్ చేస్తే... ఒక్క రోజుతో సీన్ మొత్తం మారిపోయింది.

పండ‌గ సీజ‌న్ ని టార్గెట్ చేస్తున్నామ‌ని నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, హీరోల సంబ‌రం అంతా ఆవిరైపోయింది. కోవిడ్‌, ఒమిక్రాన్ కేసుల కార‌ణంగా మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్‌` విడుద‌ల పోస్ట్ పోన్ చేయ‌డం అనివార్యంగా మారింది. దీంతో  చేసేది లేక మేక‌ర్స్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నామంటూ ప్ర‌క‌టిన చేశారు. ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్స్ కి భ‌యం ప‌ట్టుకుంద‌ని.

సినిమాపై భారీ క్రేజ్ ఏర్ప‌డి ప్రీ రిలీజ్ బిజినెస్ సాఫీగా జ‌రిగిపోవ‌డంతో దాన‌య్య 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో హ్యాపీగా వున్నారు. కానీ ప‌రిస్థితులు మారిపోవ‌డంతో ఆయ‌న‌కు రిలీజ్ భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. ఇప్ప‌టికే ఏపీ లో త‌గ్గించిన టికెట్ రేట్ల కార‌ణంగా చాలా వ‌ర‌కు అంటే దాదాపు 30 కోట్లు న‌ష్ట‌పోయిన దాన‌య్య ని ఇప్పుడు మ‌రో భ‌యం వెంటాడుతోంద‌ట‌. స‌డ‌న్ గా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయ‌డంతో చాలా మంది డిస్ట్రిబ్యూట‌ర్ లు తాము క‌ట్టిన డ‌బ్బుని తిరిగి ఇచ్చేయ‌మ‌ని నిర్మాత‌ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ లో రిలీజ్ వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా దానిపై ఇంకా క్లారిటీ రాక‌పోవ‌డంతో ఎప్పుడు రిలీజ్ డేట్ దొరుకుతుంద‌ని, సినిమా రిలీజ్ ఎప్పుడు వుంటుంద‌ని బ‌య్య‌ర్స్ నిర్మాత‌పై ఒత్తిడి చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా మేక‌ర్స్ పెట్టిన డ‌బ్బుకి, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఇచ్చిన మొత్తానికి వ‌డ్డీలు డ‌బుల్‌ అవుతున్న నేప‌థ్యంలో చాలా మంది మా డ‌బ్బులు తిరిగి ఇచ్చేస్తే మంచిద‌ని నిర్మాత‌కు ఫోన్ లు చేస్తున్నార‌ట‌. దీంతో నిర్మాత దాన‌య్య తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇదిలా వుంటే మ‌ళ్లీ కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తే మ‌రోసారి ప్ర‌చారం చేయాల్సి వుంటుంది. ఇందు కోసం మ‌ళ్లీ కోట్లు ఖ‌ర్చు పెట్ట‌క త‌ప్ప‌దు. ఈ విష‌యం కూడా `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్ కి త‌ల‌నొప్పిగా మారుతోంద‌ని చెబుతున్నారు. భారీ సినిమా ఒకే అయింద‌ని, రాజ‌మౌళి ఎంత మంది త‌న‌కే సినిమా చేయ‌మ‌ని బ్లాంక్ చెక్ లు ప‌ట్టుకొచ్చినా దాన‌య్య‌కే సినిమా చేయ‌డంతో ఇండ‌స్ట్రీలో చాలా మంది నిర్మాత‌లు దాన‌య్య‌పై అసూయ ప‌డ్డారు. దాన‌య్య ఈ దెబ్బ‌తో న‌క్క తోక తొక్కాడ‌ని కామెంట్ లు చేశారు. కానీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మాత్రం ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ట‌.

`ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ వుండ‌టంతో దాన‌య్య ప‌రిస్థితి ఏంట‌ని వాపోతున్నార‌ట‌. ప‌రిస్థితి ఏప్రిల్ వ‌ర‌కు మార‌కుంటే భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని మేక‌ర్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. ఈ సినిమా ప‌రిస్థితే ఇలా వుంటే దాన‌య్య తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. ఈ మూవీకి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. దీని ప‌రిస్థితి ఏంట‌ని అప్పుడే కొత్త చ‌ర్చ మొద‌లైంది. అయితే తాజా ప‌రిస్థితుల నుంచి `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్స్ సేఫ్ గా బ‌య‌ట‌ప‌డాల‌ని సినీ ల‌వ‌ర్స్ కోరుకుంటున్నారు.
Tags:    

Similar News