ఎలాంటి పోటీ లేకుండా బరిలో దిగిన 'సామాన్యుడు'

Update: 2022-02-04 10:30 GMT
కరోనా భయంతో పెద్ద సినిమాలను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. గత రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి థియేటర్లలోకి రాలేదు. మొన్న సంక్రాంతికి ముందు జరిగిన హంగామా చూసి ఈసారి పాన్ ఇండియా చిత్రాలన్నీ వచ్చేస్తాయని అందరూ భావించారు. కానీ థర్డ్ వేవ్ కారణంగా మరోసారి వాయిదా బాట పట్టాయి. జనవరిలో వచ్చిన సినిమాల్లో 'బంగార్రాజు' ఒక్కటే ఘనవిజయం సాధించగా.. మిగతావన్నీ నిరాశపరిచాయి. పోయిన నెల బాక్సాఫీస్ వెలవెలబోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి నెల మీద పడింది.

అయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో పెద్ద సినిమాలేవీ విడుదల చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా మీడియం రేంజ్ సినిమాలను రిలీజ్ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. దీనికి వైరస్ ప్రభావం ఒక కారణమైతే.. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న 50 శాతం ఆక్యుపెన్సీ - నైట్ కర్ఫ్యూ వంటి కోవిడ్ ఆంక్షలను మరొక కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 4) పలు చిన్న చిత్రాలతో పాటుగా ఓ డబ్బింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో డబ్బింగ్ సినిమాకి మాత్రమే క్రేజ్ ఉండటం గమనార్హం.

పడిన విశాల్ నటించిన 'సామాన్యుడు' సినిమాని ఈరోజు శుక్రవారం తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని కరోనా భయాలను పక్కన పెట్టేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. తూ.పా. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. బరిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో సామాన్యుడికే ఎక్కువ థియేటర్లు కేటాయించారు.

దీంతో పాటుగా శ్రీకాంత్ నటించిన 'కోతల రాయుడు' - యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్ట్ sచేసిన 'అతడు.. ఆమె.. ప్రియుడు' సినిమాలు కూడా ఈరోజే విడుదలయ్యాయి. అలానే 'రియల్ దండుపాళ్యం' - 'P3: పటారుపాలెం ప్రేమకథ' - 'స్వ' వంటి మరో మూడు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి థియేటర్లలోకి వచ్చాయి. వీటితో పాటుగా సంక్రాంతికి రిలీజైన సినిమాలు కూడా కొన్ని థియేటర్లలో ఆడుతున్నాయి. అయితే ఈ వారం అర డజను సినిమాలు రిలీజ్ అయినా.. 'సామాన్యుడు' సినిమా మాత్రమే అంతో ఇంతో జనాల దృష్టిని ఆకర్షించింది. మరి బాక్సాఫీస్ వద్ద విశాల్ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Tags:    

Similar News