టైటిల్ దొంగ అంటూ హీరోపై నింద‌లు

Update: 2021-07-03 04:30 GMT
త‌న సినిమా టైటిల్ ని దొంగ‌త‌నం చేశాడు! అంటూ హీరో విశాల్ పై కోడైరెక్ట‌ర్ విజ‌య్ ఆనంద్ ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు .. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌లు స‌హా ప‌లు సంద‌ర్భాల్లో విశాల్ పేరు ర‌క‌ర‌కాల వివాదాల్లో హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. ఇంత‌కుముందు తుప్ప‌రివాలన్ 2 ద‌ర్శ‌కుడు మిస్కిన్ తో వివాదంలోనూ విశాల్ పేరు హైలైట్ అయ్యింది. తెలుగు వాడైన విశాల్ తంబీల్ని ఓ ఆటాడుకోవ‌డం అక్క‌డ నిరంత‌రం చ‌ర్చ‌గా మారుతుంటుంది.

విశాల్ ప్ర‌స్తుతం `నాట్ ఎ కామన్ మాన్` అనే చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌ర‌ణ‌ జరుగుతోంది. ఈ సినిమాకి ప‌ని చేస్తున్న‌ సహ దర్శకుడు విజయ్ ఆనంద్ తన తదుపరి సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను విశాల్ ఉపయోగించారని ఆరోపించారు. తాను చిత్ర పరిశ్రమలో 15 సంవత్సరాలు కో డైరెక్టర్ గా పనిచేశానని చక్రం సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు విశాల్ కు కథాంశాన్ని వివరించానని విజయ్ ఆనంద్ చెప్పారు. ఈ కథకు తాను `కామన్ మ్యాన్` అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశానని తెలిపారు. అయితే విశాల్ తన తదుపరి సినిమాకి `నాట్ ఎ కామన్ మ్యాన్` అని టైటిల్  పెట్టారని ఇది స‌రికాద‌ని విజయ్ ఆనంద్ ఆరోపించారు.

తనకు కావాలనుకుంటే టైటిల్ అడిగి తీసుకోవాలి కానీ ఇలా చేయ‌కూడ‌ద‌ని అత‌డు ఆరోపిస్తున్నారు. ఇదే విష‌యం తాను అడిగితే విశాల్ మౌనం వ‌హించాడని ఆనంద్ ఆరోపించాడు. టైటిల్ కు సంబంధించి ఆనంద్ చేసిన అభ్యర్థనలకు విశాల్ స్పందించలేదని బదులుగా త‌న‌ను తన స్నేహితుల్లో కొంతమందిని బెదిరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను సంప్రదించి టైటిల్ వివాదాలకు స్వస్తి చెప్పాలని విజయ్ ఆనంద్ అన్నారు.

సినిమా టైటిళ్ల వివాదం ఇప్పుడే కొత్త కాదు. టాలీవుడ్ లోనూ ఈ త‌ర‌హా వివాదాలెన్నో త‌లెత్తాయి. ఇంత‌కుముందు గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ ని ఒకేసారి ఇద్ద‌రు నిర్మాత‌లు రిజిస్ట‌ర్ చేయించారు. కానీ నానీ కోసం ఇదే టైటిల్ ని ఎంచుకున్న‌ప్పుడు వివాదం తెలిసిందే. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ టైటిల్ ని `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` అని మార్చారు. ఇదే త‌ర‌హాలో చాలా సినిమాల టైటిళ్ల విష‌యంలో వివాదాలు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News