డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయొద్ద‌ని హీరోల‌కు హెచ్చ‌రిక!

Update: 2020-10-10 00:30 GMT
కొన్ని రోజుల క్రితం యువ‌న‌టుడు టోవినో థామస్ కడుపు నొప్పితో కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో చేర్చారు. క‌డుపులో కొన్ని అంతర్గత గాయాలు ఉన్నాయని తాజాగా తెలిసింది. ఈ ప్రమాదం ఆన్ సెట్స్ సంభ‌వించింది. కాలా మూవీ కోసం స్టంట్ సీక్వెన్స్ సమయంలో ఇది జరిగింది. అత‌డు స్టంట్ డబుల్ లేకుండా ఒరిజిన‌ల్ గానే న‌టించేశారు. క‌డుపులో పిడిగుద్దులు ప‌డ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని తెలిసింది. అతను ఇంకా ఐసియులో ఉన్నాడని మరియు అతని ఆరోగ్య పరిస్థితి గురించి రెండు రోజుల తరువాత మాత్రమే చెప్ప‌గ‌ల‌మ‌ని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. నేటి ఉద‌యం అత‌డి ఆరోగ్యం స్థిరంగానే ఉంద‌ని చెప్పినా ఇంత‌లోనే వైద్యులు ఇంకా క్రిటిక‌ల్ అంటూ చెప్పారు.

తీవ్రమైన కడుపు నొప్పితో తీసుకువచ్చారు. అతను వెంటనే CT యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. ఇది మెసెంటెరిక్ హెమటోమా (రక్తం గడ్డకట్టడం) ను వెల్లడించింది. అటుపై 48 గంటల పరిశీలన కోసం ఐసియుకు తరలించారు. యాంటీబయాటిక్స్‌తో చికిత్స సాగుతోంద‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించారు. గత 24 గంటలుగా నటుడు వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడని నేటి ఉద‌యం ఒక నివేదిక అందింది.

ఇక‌ 48 గంటల తర్వాత రిపీట్ సిటి యాంజియోగ్రామ్ చేయనున్నారు. అప్పటి వరకు అతను ఐసియులో పరిశీలనలో ఉంటాడు. అతను ఏదైనా తీవ్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తే.. లాపరోస్కోపిక్ చేయాల్సి ఉంటుందిట‌. అయితే.. ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ అతని పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తేల్చింది. అయితే ఈ యువ‌న‌టుడి ప్ర‌మాదం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో హీరోల‌కు ముంద‌స్తు హెచ్చ‌రిక లాంటిది. డూప్ లేకుండా స్టంట్స్ చేయాల‌న్న త‌ప‌న మంచిదే కానీ యువ‌హీరోలు మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఈ ఘ‌ట‌న హెచ్చ‌రిస్తోంది. గ‌త ఏడాది గోపిచంద్.. సందీప్ కిష‌న్.. శర్వానంద్ లాంటి హీరోల‌కు ఇలాంటి ప్ర‌మాదాలు ఎదుర‌య్యాయి. ఇప్పుడిలా మ‌ల‌యాళీ యువ‌హీరో తీవ్ర ఇబ్బందుల్లో ఉండ‌డం అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.




Tags:    

Similar News