ముగ్గురు భామ‌ల‌తో డిస్కో ఆడ‌తాడా?

Update: 2019-07-08 05:36 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `డిస్కోరాజా`. నేల టిక్కెట్.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లాంటి డిజాస్ట‌ర్ల తర్వాత కంబ్యాక్ కోసం చాలా ఆలోచించి ఎంచుకున్న క‌థాంశ‌మిది. ర‌వితేజ ఇమేజ్ కి పూర్తి భిన్న‌మైన‌ది. పైగా సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` ఫేమ్ వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అప్ప‌ట్లో సైలెంటుగా ముహూర్తం జ‌రుపుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ గ‌త నెలలో మొద‌లైంది. ఈ చిత్రంలో ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు.. ఏకంగా ముగ్గురు భామ‌లు న‌టిస్తుండ‌డం రాజా ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతోంది.

మూసకు  భిన్నంగా కొత్త పంథాలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ర‌వితేజ‌కు జోడీగా `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయ‌ల్ రాజ్‌ పుత్‌, క‌న్న‌డ బ్యూటీ న‌భా న‌టేష్‌ ల‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. ఈ ఇద్ద‌రితో పాటు ఇందులో మ‌రో హీరోయిన్ కి స్కోప్ వుంద‌ట‌. దీంతో మూడ‌వ నాయిక‌గా మాస్ రాజా ప‌క్క‌న ఎవ‌రు న‌టిస్తారా అనే ఆస‌క్తి నెల‌కొంది.

`అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` చిత్రంలో శ్రీ‌విష్ణుకు జోడీగా న‌టించిన క‌న్న‌డ సుంద‌రి తాన్యా హోప్‌ ని ఆ ఛాన్స్ వ‌రించిన‌ట్లు తెలిసింది. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, నేను శైల‌జ‌, ప‌టేల్ సార్ చిత్రాల్లో తాన్యా హోప్ న‌టించింది. అయినా ఆమెకు సరైన అవ‌కాశాలు వ‌రించ‌లేదు. తాజాగా ర‌వితేజ స‌ర‌స‌న మూడ‌వ నాయిక‌గా  ఛాన్స్ ద‌క్కిడంతో ఇకపై తాన్యా కెరీర్ ఊపందుకునే అవ‌కాశం వుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ర‌వితేజ ఎంత‌గానో అభిమానించే త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌డం అడ్వాంటేజ్. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్నార‌ని తెలుస్తోంది. క‌థ‌లో కొత్త‌ద‌నం అంత‌కుమించి గ్లామ‌ర‌స్ బ్యూటీస్ తో స్పెష‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని దీనిని బ‌ట్టి గెస్ చేయొచ్చు.




    
    
    

Tags:    

Similar News