శింబు సినిమాలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు!

Update: 2021-02-04 03:30 GMT
తమిళ స్టార్ హీరోలలో శింబు ఒకరు .. అక్కడ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు అక్కడి మాస్ హీరోలలో ముందు వరుసలో కనిపించే ఈ హీరో, ఆ తరువాత కొన్ని రకాల వివాదాల కారణంగా వెనకబడుతూ వచ్చాడు. ఆ కారణంగా ఆయనకి అవకాశాలు మాత్రమే కాదు .. విజయాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో  ఆయన తాజా చిత్రంగా 'మానాడు' సినిమా రూపొందుతోంది. వి హౌస్ ప్రొడక్షన్స్ వారు 125 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటం విశేషం.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యువన్  శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ.. హిందీ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ ఉండటం విశేషం. వారే ఎస్.జె. సూర్య .. భారతీరాజా .. ఎస్.ఎ. చంద్రశేఖర్. ఈ ముగ్గురి పాత్రలు తెరపై చాలా విభిన్నంగా .. విలక్షణంగా కనిపిస్తాయని చెబుతున్నారు.

అయితే శింబుకి తమిళంలో తప్ప మరెక్కడా పెద్ద ఫాలోయింగ్ లేదు. తెలుగులోనే చూసుకుంటే, 'మన్మథ' .. 'వల్లభ' సినిమాలు తప్ప ఓ మాదిరిగా ఆడిన సినిమాలు కూడా లేవు. అలాంటి శింబు సినిమాకి 125 కోట్ల బడ్జెట్ అనేదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఆ స్థాయి బడ్జెట్ ఆయనకి వర్కౌట్ అవుతుందా అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్ ను రవితేజ చేతుల మీదుగా ఈ మధ్యాహ్నం 2:34 నిమిషాలకు రిలీజ్ చేయిస్తూ ఉండటం విశేషం.    
Tags:    

Similar News