పిచ్చి కామెడీలే కొంప ముంచుతున్నాయ్‌

Update: 2015-04-08 17:30 GMT
నిజానికి ఒక డబ్బింగ్‌ చేసిన హాలీవుడ్‌ మూవీ తెగ ఆడేస్తుంటే.. మన తెలుగు సినిమాలు ఎందుకని ఇబ్బందులు పడుతున్నాయ్‌? జిల్‌, రేయ్‌, ఎవడే సుబ్రమణ్యం, అవును 2 వంటి సినిమాలకు అరకొర ఆదరణ లభిస్తుంటే.. హాలీవుడ్‌ సినిమా ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7కు మాత్రం మనోళ్ళు ఎందుకని రెడ్‌ కార్పెట్‌ వేసేశారు? చాలామంది ఆడియన్స్‌ ఫీలింగ్‌ ఏంటంటే.. మనోళ్ళు తెలిసిపోయేలా పిచ్చి కామెడీ చేసి దొరికిపోవడం, మనోళ్లకి హాలీవుడ్‌ టైపులో మసిపూరి మారేడుకాయను చేయడం రాకపోవడం.

బాలకృష్ణ తొడకొట్టి ట్రైన్‌ ఆపితే తిడతారు (పల్నాటి బ్రహ్మనాయుడు).. రజనీకాంత్‌ నుదుటితో బుల్లెట్టును ఆపితే ఒప్పుకోరు (శివాజీ).. కాని విమానంలో నుండి కార్లకు ప్యారాషూట్స్‌ వేసుకొని క్రిందకు దూకించేస్తే మనోళ్ళకు ఓకే (ఫ్యూరియస్‌ 7).. లేదా ఒక పెద్ద కింగ్‌ కాంగ్‌ను తాళ్ళతో కట్టించి బంధించేస్తే ఓకె (కింగ్‌ కాంగ్‌).. ఇక్కడ మ్యాటర్‌ ఏంటంటే.. ఇప్పుడు కొత్తగా వచ్చిన మన సినిమాల్లో ఏకంగా ఎఫ్‌.బి.ఐ అనే పేరుమోసిన అమెరికన్‌ ఇన్వెస్టిగేషన్‌ సంస్థనే సింపుల్‌గా ఏదో సర్కస్‌లోని ఏనుగు బోర్లాకొట్టించినట్లు వైవిఎస్‌ చైదరి రేయ్‌లో ఒక సీన్‌ తీశాడు.. ఇక అవును 2లో మనుషుల్లోకి ప్రవేశించి ఒక దెయ్యం, ఇంట్లోకి రావడానికి మాత్రం లిఫ్ట్‌ ఎక్కి తలుపులు తీసుకొని వస్తుంది. లాజిక్‌ లేకుండా ఏంటి గురూ ఈ సీన్లు?

నిజానికి.. కేవలం ఆడియన్స్‌ను కన్విన్స్‌ చేయలేకపోవడంతో చిన్న చిన్న లోపాలన్నీ దొరికిపోయి తెలుగు సినిమాలు కామెడీగా కనిపిస్తున్నాయి. హాలీవుడ్‌ స్టంట్స్‌లో కూడా లాజిక్‌ లేదు. కాని వారు వాటిని నిజంగానే కుదురుతుంది అన్నట్లు నమ్మించగలుగుతున్నారు. మనం మాత్రం కార్టూన్‌ సినిమాల్లో కామెడీలా తీస్తున్నాం. దానితో సినిమాలు తూచ్‌ అంటున్నాయనేది ఒక వాదన

Tags:    

Similar News