ట్రోలింగ్ డోంట్ కేర్ అంటున్న టాలీవుడ్

Update: 2018-09-05 01:30 GMT
సోషల్ మీడియాలో జనాలకు ఏ చిన్న అవకాశం దొరికినా చెలరేగిపోతుంటారు. ఫన్నీ మీమ్స్ తయారు చేసి ట్రోలింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి సెలబ్రెటీలు ఇంతకుముందు అసహనం చెందేవాళ్లు. నెటిజన్లకు కౌంటర్లు ఇచ్చేవాళ్లు. కానీ ఈ మధ్య టాలీవుడ్ జనాలు ట్రోల్స్ ను బాగా లైట్ తీసుకుంటున్నారు. వాటిని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. నెటిజన్లు తమను లక్ష్యంగా చేసుకున్నపుడు పెద్దగా ఫీలవ్వట్లేదు. వాళ్లతో కలిసి మీమ్స్ ను వీళ్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. ‘గీత గోవిందం’ కోసం అతను పాడిన ‘వాట్ ద ఎఫ్’ పాట తీవ్ర వివాదాస్పదమైంది. విజయ్ వాయిస్ విషయంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనికి అతను ఫీలై ఉంటాడని అంతా అనుకున్నారు.

కానీ విజయ్ మాత్రం ఈ చిత్ర ఆడియో వేడుకలో తన మీద వచ్చిన మీమ్స్ ను చూపించి.. అందరినీ ఎంటర్టైన్ చేశాడు. దాన్ని కూడా సినిమా ప్రచారానికి ఉపయోగించుకున్నాడు. ఈ విషయంలో అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ఫిదా అయిపోయాడు. విజయ్ కంటే ముందు సుశాంత్ సైతం తనపై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో సరదాగా స్పందించాడు. ‘గట్టిగా కొడతా’ అంటూ ఒక టైటిల్ తో తన పేరిట సినిమా అనౌన్స్ చేయడంపై అతను లైట్ తీసుకున్నాడు. దాన్ని తన సినిమా ‘చి ల సౌ’ ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్నాడు. వీళ్లను స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో.. ఇప్పుడు సీనియర్ హీరోగా మోహన్ బాబు సైతం తనపై వచ్చిన ‘ఫసక్’ మీమ్స్ విషయంలో సరదాగా స్పందించాడు. ‘ఫసక్’ పదం ట్రెండ్ అవుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. తనపై వచ్చిన స్పూఫ్ వీడియోల్ని తాను కూడా చూశానని.. అవి చాలా సృజనాత్మకంగా.. ఫన్నీగా ఉన్నాయని ట్వీట్ చేయడం విశేషం.
Tags:    

Similar News