అందరూ సచ్ఛీలురే.. మరి తప్పెవరిది?

Update: 2017-07-20 07:43 GMT
‘‘జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ ముఖం చూసింది లేదు’’.. ‘‘నాకు నోటీసులిచ్చారని తెలిసి షాకయ్యా’’.. ‘‘అసలు నాకు నోటీసులెందుకొచ్చాయో అర్థం కావడం లేదు’’.. టాలీవుడ్లో డ్రగ్ రాకెట్ బయటికి వచ్చి పోలీసులు కొందరు సినీ ప్రముఖులకు నోటీసులిచ్చాక వాళ్లందరి నోటి నుంచి కామన్ గా వినిపించిన వ్యాఖ్యలివి. ఇది మొదటి దశ అయితే.. రెండో దశలో వరుసగా సెంటిమెంటు స్టోరీలు వినిపిస్తున్నాయి.

‘‘మా కుటుంబాల బాధేంటో మీకేం తెలుసు’’.. ‘‘ఇంట్లో వాళ్లు ఒకటే ఏడుస్తున్నారు’’.. ‘‘మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది’’.. ‘‘నరకయాతన అనుభవిస్తున్నాం’’.. ‘‘జీవితాలు నాశనమైపోతున్నాయి’’.. ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు.. వారి కుటుంబ సభ్యుల నుంచి. తాజాగా పూరి జగన్నాథ్ ఎంత ఎమోషనల్ గా తన వెర్షన్ వినిపించాడో తెలిసిందే.

ఐతే నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరిదీ ఒకటే వాదన. తాము సచ్ఛీలురం అని.. తమకు డ్రగ్స్ తో అసలు సంబంధమే లేదని. ఎవరి వాదన విన్నా బలంగానే ఉంది. రవితేజకు సిగరెట్ అలవాటు కూడా లేదని అంటున్నారు అతడి కుటుంబ సభ్యులు. పూరి అసలు తాను చట్టానికి వ్యతిరేకంగా ఏ పనీ చేయనని.. జీవితంలో డ్రగ్స్ ముట్టుకోలేదని అంటున్నాడు.

మిగతా వాళ్ల వాదన విన్నా అయ్యో పాపం అనిపిస్తోంది. నిజంగా వీళ్లు అనవసరంగా నింద ఎదుర్కొంటుంటే.. అది చాలా బాధాకరమైన విషయం. చేయని తప్పుకు నింద ఎదుర్కోవడం అన్నది ఎంతో బాధ కలిగిస్తుంది. అసహనానికి గురి చేస్తుంది. ఐతే ఈ విషయంలో పోలీసులు తొందరపడ్డారా.. అత్యుత్సాహం ప్రదర్శించారా.. అసలు తమ దగ్గర సరైన ఆధారాలేమీ లేకుండా ఉత్తిగానే నోటీసులిచ్చేశారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పోలీసులు ఏమీ లేకుండా ఊరికే అంత పెద్ద సెలబ్రెటీల్ని డీఫేమ్ చేసేస్తారా..? తొందరపడి నోటీసులిచ్చేస్తారా..? ఏకంగా పది గంటల పాటు విచారించాల్సిన అవసరం ఉంటుందా..? అన్నది ఆలోచించాలి. వాళ్లు నోటీసులిచ్చిన ప్రతి ఒక్కరూ తమను తాము సచ్ఛీలురుగానే ప్రకటించుకుంటున్నారు. మరి వీళ్లందరి విషయంలోనూ పోలీసులు తప్పటడుగు వేశారా.. ఉద్దేశపూర్వకంగా వాళ్లను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా.. అన్నది చూడాలి. పోలీసులకు ఆ అవసరం ఏంటన్నది ఆలోచించాలి.

కొందరు పెద్దోళ్లను రక్షించడానికి.. కేసును పక్కదోవ పట్టించడానికి ఇంకొందర్ని కావాలనే ఇరికించారని అంటున్నారు. కానీ ఇప్పుడు నోటీసులందుకున్న వాళ్లు కూడా తక్కువోళ్లేమీ కాదన్నది గుర్తుంచుకోవాలి. సింపుల్ గా ఇరికిస్తే ఇరుక్కుపోయేవాళ్లేమీ కాదు ఇప్పుడు నోటీసులందుకున్న వాళ్లు. పోలీసులు ఎవరినైనా కాపాడుతుంటే.. పేర్లు బయటికి రాకుండా చూస్తుంటే అది కచ్చితంగా తప్పే. అన్ని విషయాలూ బయటికి రావాల్సందే.

మున్ముందు కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో ఎదురు చూడాలి. వేరే వాళ్లను కాపాడేందుకు తమను బలిపశువుల్ని చేస్తున్నారనుకుంటే.. దానిపై సమాచారం ఉంటే.. ఇప్పుడు నోటీసులందుకున్నవాళ్లు ఊరికే ఉండరు. అందరినీ ఇరికించాలనే చూస్తారు. ఐతే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తాము క్లీన్ అని చెప్పుకుంటూ సెంటిమెంటు స్టోరీలు వినిపించినంత మాత్రాన వాళ్లు సచ్ఛీలురని అనుకోవడానికి మాత్రం లేదు.

విచారణ ముగిసేవరకు కొంచెం ఎదురు చూస్తే ఎవరి ప్రమేయం ఏముందో తెలుస్తుంది. ముందే ఎవరినీ తప్పుగా అనుకోవడానికి లేదు. అదే సమయంలో అందరూ క్లీన్ అనుకోవడానికీ లేదు. స్కూలు పిల్లల్నీ డ్రగ్స్ ఊబిలో దించుతుండటం అన్నది తీవ్రమైన విషయం. అందుకే ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. కేసును డీల్ చేస్తున్న అకున్ సబర్వాల్ కు సిన్సియర్ పోలీసాఫీసర్ అన్న పేరుంది. కాబట్టి ఈ కేసు సరైన దారిలోనే సాగుతుందని.. అందరి బాగోతాలు బయటికి వస్తాయని ఆశిద్దాం.
Tags:    

Similar News