2015లో తెలుగు చిత్రసీమకి బాహుబలి - శ్రీమంతుడులాంటి చారిత్రాత్మక విజయాలు దక్కాయి. ఒక విజువల్ వండర్ గా నిలిచిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ: 600కోట్ల రూపాయల్ని సొంతం చేసుకొంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే తెరకెక్కిన శ్రీమంతుడు రూ: 150కోట్లకుపైగా వసూలు చేసి అదరగొట్టింది. ఈ విజయాల రూపంలో 2015 తెలుగు చిత్రసీమకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ యేడాది మరో రకంగానూ మరిచిపోలేదు తెలుగు చిత్రసీమ. 2015 మొత్తం పరిశ్రమలో మరణ మృదంగం వినిపించింది. జనవరి ఆరంభంలోనే విలక్షణ నటుడు ఆహుతిప్రసాద్ ని కోల్పోయాం. ఆ తర్వాత ఎమ్మెస్ నారాయణ - రామానాయుడు - వి.బి.రాజేంద్రప్రసాద్... ఇలా ప్రతీ నెల ఎవరో ఒకర్ని కోల్పోవల్సి వచ్చింది. మొత్తం 30మంది సినీ ప్రముఖుల్ని ఈ యేడాది తనలో కలిపేసుకొని చిత్రసీమకి తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. అకాల మరణాలు చిత్రసీమని ఒక్కసారిగా కలవరపాటుకి గురిచేశాయి. దీంతో పండితులతో ప్రత్యేకంగా హోమాలు కూడా జరపించారు. అయినా మరణాలు ఆగలేదు. 2016 మాత్రం అలాంటి చేదు అనుభవాల్ని ఇవ్వకూడదని పరిశ్రమ గట్టిగా కోరుకొంటోంది.