టాలీవుడ్ డ్రగ్స్ కేసు: సినీ ప్రముఖుల మొబైల్ ఫోన్‌లను కోరిన ఈడీ..!

Update: 2022-06-09 14:15 GMT
2017లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇచ్చిన ఈ కేసులో.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) మరియు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది.

డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ - రానా దగ్గుబాటి - రవితేజ - ఛార్మీ కౌర్ - పూరీ జగన్నాధ్ - నవదీప్ - ముమైత్ ఖాన్ - తనీష్ - నందు - తరుణ్ వంటి సినీ ప్రముఖులను విచారించడం టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు హాట్ టాపిక్ గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఈ కేసు గురించి ఎలాంటి అప్డేట్ లేదు.. ఇప్పటి వరకు ఎవరి మీద చర్యలు లేవు.

అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2017 డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల మొబైల్ ఫోన్లను సమర్పించాలని పేర్కొంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కోర్టులో ఈడీ గురువారం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిన కేసును లోతుగా విచారించడానికి ఈడీ రెడీ అయింది. ఇప్పటికే కోర్టు ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర్నుంచి ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను తెప్పించుకుంది. అయితే అప్పట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న 12 మొబైల్ ఫోన్లను ఈడీకి సమర్పించలేదు.

ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా ఈడీ దీనిపై వివరణ కోరింది. వీలైనంత త్వరగా సమాధానం కోరుతోందని తెలుస్తోంది. దీనిని బట్టి టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పురోగతి లభిస్తే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

2017లో తెలంగాణా ఆబ్కారీ పోలీసులు హైదరాబాద్ నగరంలో కెల్విన్ మార్కెరాన్స్ అనే డ్రగ్ సప్లయిర్ ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు.. పలువురు సినీ ప్రముఖులను విచారరించారు. కానీ డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు ఈడీ ఈ కేసులో ఏమి నిగ్గుతేలుస్తుందో చూడాలి.

ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు కాబడిన ఏ సెలబ్రిటీపై కూడా ఆరోపణలు నిరూపించబడలేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్ట్ కాబడిన హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్ పై విడుదలైంది. అలానే కన్నడ చిత్ర సీమను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసులో జైలుకెళ్లిన హీరోయిన్లకు కూడా బెయిల్ వచ్చింది.

ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో అరెస్టైన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఎన్సీబీ అతడికి క్లీన్ చిట్ ఇచ్చింది. మరి ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఏమి తేలుస్తుందో.. ఎలాంటి ఆధారాలు రాబడుతుందో చూడాలి.
Tags:    

Similar News