టాలీవుడ్‌ మేల్కొంది కానీ..

Update: 2022-06-04 15:30 GMT
మొత్తానికి టికెట్ల రేట్ల కాక టాలీవుడ్‌కు బాగానే తాకినట్లుంది. అసలే కొవిడ్, ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోగా.. అది చాలదన్నట్లు అయినకాడికి టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకులను వెండి తెరలకు మరింత దూరం చేసేశారు. ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది కదా అని అపరిమితంగా రేట్లు పెంచేయడం తీవ్ర ప్రభావమే చూపింది. ఒకప్పుడు వేసవి వస్తే.. సినిమా ఎలాంటిదైనా సరే ఏసీలో సేదదీరడానికైనా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు.

అలాగే వీకెండ్లో సినిమా చూసి రెస్టారెంటుకు వెళ్లడం అలవాటుగా ఉన్న వాళ్లు కూడా టాక్‌తో సంబంధం లేకుండా ఏదో ఒక సినిమా చూసేవారు. అప్పుడు టికెట్ల ధరలు అందుబాటులోనే ఉండేవి కాబట్టి ఈ ఖర్చును భారంగా భావించే వాళ్లు కాదు. కానీ కొవిడ్ కారణంగా తలెత్తిన నష్టాలను భర్తీ చేసుకోవడానికో, ఆదాయం పెంచుకోవడానికో.. కారణం ఏదైతేనేం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా అని టికెట్ల ధరలను ఒకేసారి డబుల్ చేసేయడం అసలుకే ఎసరు పెట్టింది.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి స్పెషల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే బిగ్ టికెట్ ఫిలిమ్స్ వరకు ఈ రేట్లు బాగా పనికొచ్చాయి కానీ.. తర్వాత ఆచార్య, సర్కారు వారి పాట లాంటి మామూలు చిత్రాలకు కూడా ఇవే రేట్లు కొనసాగించడం, పైగా అదనంగా రేట్లు వడ్డించడం జనాలకు మండిపోయేలా చేసింది. అందుకే ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఎఫ్-3 సినిమాకు దిల్ రాజు అదనంగా రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా ఛాన్స్ తీసుకోలేదు.

ఐతే ఈ సినిమాకు మామూలు రేట్లే అని రాజు చెప్పాడు కానీ.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కాకుండా సింగిల్ స్క్రీన్లలో రూ.175, మల్టీప్లెక్సుల్లో రూ.295 అంటే తక్కువ రేటేమీ కాదు. అవి కూడా ప్రేక్షకుడికి భారమే. సోషల్ మీడియాలో జనాల స్పందన చూస్తే ఈ రేట్లు కూడా వర్కవుట్ కావని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే 'మేజర్' సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 195 రేటు పెట్టారు.

ఇది సినిమాకు బాగానే ఉపకరిస్తోంది. ఆక్యుపెన్సీ పెరగడానికి కారణమవుతోంది. ఇప్పుడు గోపీచంద్ సినిమా 'పక్కా కమర్షియల్'కు రేట్లు ఇంకా తగ్గించి మల్టీప్లెక్సుల్లో రూ.177, సింగిల్ స్క్రీన్లలో 100తో టికెట్లు అమ్మబోతున్నట్లు నిర్మాత బన్నీ వాసు ప్రకటించాడు. సినిమా బిజినెస్ విషయంలో తలపండిన అల్లు అరవింద్ ఈ నిర్ణయం వెనుక ఉన్నారన్నది స్పష్టం.

దిల్ రాజు, అరవింద్ లాంటి పెద్ద నిర్మాతలు తమ సినిమాల విషయంలో రేట్ల పరంగా ఇలా తగ్గారు అంటే అధిక ధరల విషయంలో జనాగ్రహాన్ని అర్థం చేసుకున్నట్లే. ఇండస్ట్రీలో దీనిపై అంతర్గతంగా చర్చ జరిగే ఉంటుంది. కొంచెం ఆలస్యంగా అయినా సరే.. మేల్కోవడం మంచిదే కానీ.. ఈ నిర్ణయాలు థియేటర్లకు రావడం మానేసిన ప్రేక్షకులను వెంటనే మళ్లీ అటు వైపు రప్పించగలవా అన్నది చూడాలి. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు మాత్రమే రేట్లు తగ్గించి.. మళ్లీ పెద్ద సినిమాలకు అదనంగా వడ్డిస్తే మాత్రం మున్ముందు థియేటర్ల మనుగడ కచ్చితగా ప్రశ్నార్థకమే అవుతుంది. కాబట్టి ఒక్కో సినిమాకు ఒక్కోలా అని కాకుండా మొత్తంగా రేట్లను తగ్గించి పూర్వపు స్థాయికి తీసుకెళ్లడం చాలా అవసరం.
Tags:    

Similar News