కోవిడ్ బారిన ప‌డిన మరో టాలీవుడ్ హీరో

Update: 2021-12-31 10:47 GMT
టాలీవుడ్ ఇండ‌స్ట్రీపై క‌రోనా పంజా విసురుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌తంలో చాలా మంది ఇండ‌స్ట్రీకి చెందిన వారు కోవిడ్ బారిన ప‌డి కొంత మంది కోలుకోగా కొంత మంది మృత్యువాత ప‌డ్డారు. ఇక కోవిడ్ బాధు త‌ప్పాయ‌ని అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ కొత్త ఆశ‌లు చిగురింప‌జేస్తున్న వేళ మ‌ళ్లీ క‌రోనా ర‌క్క‌సి కోర‌లు చాస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది.

బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనూ క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తున్న వేళ దాని ప్ర‌కంప‌ణ‌లు టాలీవుడ్ లోనూ మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల హీరో మంచు మ‌నోజ్ తాను కోవిడ్ బారిన ప‌డ్డాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో హీరో త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలిందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విష‌యాన్ని ఆయ‌న సోస‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

`అంద‌రికి హాయ్.. నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం నేను ఇంట్లోనే స్వ‌య నిర్భంధంలో వున్నాను. డాక్ట‌ర్లు చెప్పిన‌ట్టుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ చికిత్స తీసుకుంటున్నాను. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా క‌రోనా దావాన‌లంలా వ్యాపిస్తోంది. ద‌య‌చేసి అంద‌రు మాస్కులు ధ‌రించి జాగ్ర‌త్త‌గా ఉండండి. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు` అని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు.

ఇటీవ‌ల `పాగ‌ల్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం త‌మిళ హిట్ చిత్రం `ఓ మై క‌డ‌వులే` ఆధారంగా రీమేక్ అవుతున్న `ఓరి దేవుడా` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. విశ్వ‌క్ సేన్ కు క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే ఆయ‌న అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్ లు చేస్తున్నారు.
Tags:    

Similar News