క‌రోనా సాయంతో 2022లో స‌రికొత్త రికార్డ్

Update: 2022-12-30 03:59 GMT
2022 టాలీవుడ్ కి క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. ఈ ఏడాదిలో టాలీవుడ్ అత్యధిక తెలుగు సినిమాలను విడుదల చేసిన సంవత్సరంగా అద‌ర‌గొట్టింది. ఇందులో కొన్ని భారీ విజ‌యాలు ఉత్సాహం నింపాయి. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు క‌లుపుకుని మొత్తం 297 సినిమాలు టాలీవుడ్ నుంచి విడుదలయ్యాయి. 90 ఏళ్ల‌ తెలుగు సినిమా చరిత్రలో ఇది అరుదైన రికార్డ్.

ఓసారి హిస్ట‌రీని ప‌రిశీలిస్తే.. 2013 సంవత్సరంలో 270 సినిమాలు విడుద‌ల కాగా.. 2014లో 276 సినిమాలు విడుద‌ల‌య్యాయి. 2016లో 266 విడుదల కాగా 2019లో 269 థియేట‌ర్ల‌లోకి వచ్చాయి. ఇప్పుడు 2022లో 297 సినిమాల‌తో స‌రికొత్త రికార్డ్ ఆవిష్కృత‌మైంది.

అయితే 2022లో ఇన్ని సినిమాలు రిలీజ‌వ్వ‌డం వెన‌క కార‌ణం వేరు. కోవిడ్ 19 లాక్ డౌన్ ల‌తో అత‌లాకుత‌లం అయిన ప‌రిశ్ర‌మ‌లో షూటింగులు నెమ్మ‌దించాయి. 2020-21 సీజ‌న్ వ‌రస్ట్ గా మారింది. ముఖ్యంగా ఈ సీజ‌న్ వినోద‌ప‌రిశ్ర‌మ‌కు అశ‌నిపాతం. సెట్స్ లో ఉన్న సినిమాల‌ను పూర్తి చేసి రిలీజ్ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. 2020 సంవత్సరంలో కొత్త విడుదలలకు పెద్ద విరామం రావ‌డానికి కార‌ణ‌మైంది.

ఈ ఏడాది కేవ‌లం 64 సినిమాలు విడుద‌ల‌య్యాయంటే స‌న్నివేశం ఎంత దారుణంగా మారిందో ఊహించ‌వ‌చ్చు. 2021 సంవత్సరంలో వ‌రుస‌ లాక్ డౌన్ ల కారణంగా చాలా సినిమాలు వాయిదాల ఫ‌ర్వంలో రిలీజ‌య్యాయి. చివరకు పెండింగ్‌లో ఉన్న చిత్రాలన్నీ 2022 విడుదలకు క్యూ కట్టాయి. దీంతో ఆ సంఖ్య 297కి చేరిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

2022 త‌ర్వాత (297 సినిమాలు) 2014 లో అత్య‌ధిక (276 సినిమాలు)గా సినిమాలు విడుద‌ల‌య్యాయి. 2013  (270 సినిమాలు) 2019 (269 సినిమాలు) 2016 (266 సినిమాలు) టాప్ 5 లో నిలిచాయి. ఇక 2022లో చాలా సినిమాలు రిజ‌ల్ట్ ప‌రంగా దారుణ ఫ‌లితాను చూసాయి.

అయితే కొన్ని మెగా హిట్లు బంప‌ర్ హిట్లు ఉండ‌డంతో ప‌రాజ‌యాల‌ ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌లేదు. ఈ ఏడాదికి ఆర్.ఆర్.ఆర్-  కార్తికేయ 2- గాడ్ ఫాద‌ర్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు కొత్త ఊపు తెచ్చాయి. క‌న్న‌డ రంగం నుంచి కేజీఎఫ్ 2 కూడా ఒక ఊపు ఊప‌డం సౌత్ కి ప్ల‌స్ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News