మన నిర్మాతలు దేశముదుర్లే..

Update: 2019-02-15 08:55 GMT
ప్రియ ప్రకాష్ వారియర్.. ఏడాదిగా ఈ పేరు ఎలా మార్మోగిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 30 సెకన్లు.. కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అందులో ఆమె తనదైన శైలిలో కన్ను గీటిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. కొన్ని రోజుల్లోనే ఆమె కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. పెద్ద సెలబ్రెటీ అయిపోయింది. సినిమాలతో పాటు ప్రకటనల్లోనూ అవకాశాలు అందుకుంది. ప్రియ క్రేజ్‌ ను క్యాష్ చేసుకుందామని చాలామంది ప్రయత్నించారు. అందులో తెలుగు నిర్మాతలు కూడా ఉన్నారు. ఐతే ప్రియ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటుండటంతో కొంచెం నెమ్మదించారు.

ఆపై మన నిర్మాతల్లో వేరే ఆలోచనలు వచ్చాయి. వెంటనే కమిట్మెంట్ ఇచ్చేయకుండా ప్రియ తొలి సినిమా రిలీజ్ కోసం ఎదురు చూశారు. అందులో ప్రియ ఓవరాల్ పెర్ఫామెన్స్ ఎలా ఉందో.. సినిమా రిజల్ట్ ఏంటో చూద్దామని ఆగారు. తీరా చూస్తే ‘ఒరు అడార్ లవ్’ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లు లబోదిబోమంటున్నారు. థియేటర్ల నుంచి హాహాకారాలు పెడుతూ బయటికి వస్తున్నారు. ప్రియ ఇందులో ఏమాత్రం ప్రత్యేకత చాటుకోలేకపోయింది. ఆల్రెడీ చూసిన కన్నుగీటే దృశ్యాలు మినహాయిస్తే ఆమె స్పెషాలిటీ చూపించే సన్నివేశాలేమీ లేవు. ప్రియ పెర్ఫామెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఈ సినిమా తర్వాత ప్రియకు ఛాన్సులు రావడం కష్టమే అనిపిస్తోంది. మొత్తానికి ప్రియ విషయంలో మరీ తొందరపడకుండా వెయిట్ అండ్ సీ సూత్రం పాటించిన మన నిర్మాతల్ని అభినందించాల్సిందే.


Tags:    

Similar News