సంక్రాంతి పందెంకోళ్లు ఎవరో

Update: 2018-06-10 17:30 GMT

టాలీవుడ్ కు సంబంధించినంత వరకు సంక్రాంతి సీజన్ చాలా కీలకం. అందుకే ఆరేడు నెలల ముందు నుంచే తమ సినిమాలను ఆ డేట్ కి ప్లాన్ చేసుకునేలా షూటింగ్ చేసుకునే సినిమాలు చాలానే ఉంటాయి. అందుకే ఎంత పోటీ ఉన్నా కనీసం మూడు నుంచి ఐదు సినిమాలు ప్రతి సంవత్సరం బరిలో ఉంటున్నాయి. ఈ ఏడాది పవన్ కళ్యాణ్-బాలకృష్ణ-సూర్య-రాజ్ తరుణ్ పోటీ పడగా కమర్షియల్ గా బాలయ్య ఒక్కడే పాస్ అనిపించుకోగా సూర్య ఎలాగోలా గట్టెక్కి జస్ట్ ఓకే చేయించుకున్నాడు. ఇక రానున్న సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైరా గతంలోనే సంక్రాంతి అనుకున్నారు కానీ షూటింగ్ పరంగా గ్రాఫిక్ వర్క్ పరంగా ఏ మాత్రం ఛాన్స్ లేకపోవడంతో మే 9 ఫిక్స్ చేసే ఆలోచనలో టీమ్ సీరియస్ గా ఉంది. పైగా జగదేకవీరుడు అతిలోకసుందరి-గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ రిలీజ్ అయిన డేట్ గా సెంటిమెంట్ కూడా అక్కడ కలిసొస్తోంది. సో ఎలా చూసుకున్నా సైరా తప్పుకున్నట్టే. ఇక తాను ఎంతో ఇష్టపడే సంక్రాంతికి  నాన్న బయోపిక్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చే ఆలోచన బాలయ్య చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాదే అన్నారు కానీ సబ్జెక్టులో ఉన్న డెప్త్ దానికయ్యే బడ్జెట్ దృష్ట్యా అది అంత ఈజీ కాదు.

ఇక వంశీ పైడిపల్లితో తన 25వ సినిమా చేస్తున్న మహేష్ బాబు కన్ను కూడా సంక్రాంతి మీదే ఉందట. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ ఆ టైంలోనే వచ్చి భారీ వసూళ్లు దక్కించుకుంది. షూటింగ్ మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతోంది కాబట్టి ఆ డెడ్ లైన్ అందుకోవడం అసాధ్యం అయితే కాదు. అలా అని సులభం కూడా అనలేం. అది ప్లానింగ్ ని బట్టి ఉంటుంది. ఇక రామ్ చరణ్ బోయపాటి కాంబో తెరకెక్కుతున్న మసాలా ఎంటర్ టైనర్ కూడా రేస్ లో నిలిచే ఆలోచన్లలో ఉన్నట్టు సమాచారం. ఎలాగూ ఈ సంవత్సరం తన అకౌంట్ లో రంగస్థలం సక్సెస్ వచ్చి చేరింది కాబట్టి దసరాకు కాకుండా సంక్రాంతి టైం అయితేనే బెస్ట్ అని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఎలాగూ రాజమౌళి సినిమా చేసే టైంలో భారీ గ్యాప్ తప్పదు కనక ఫాన్స్ మరీ లోటు  ఫీల్ కాకుండా ఉండేందుకు అదైతేనే సరైన టైం అని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఏ ఒక్కటి ఖరారుగా సదరు దర్శక నిర్మాతలు చెప్పలేదు కానీ తెరవెనుక మాత్రం దానికి తగ్గ  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరు తప్పుకుంటారు ఎవరు నిలుస్తారు అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News