సంక్రాంతికి థియేట‌ర్ వార్ ఖాయ‌మా?

Update: 2018-01-07 18:28 GMT
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా....స‌ర‌దాలు తెచ్చిందే తుమ్మెదా....కొత్తా అల్లుళ్ల‌తో.....కోడి పందేల‌తో ఊరే ఉప్పొంగుతుంటే......ఇది ఓ తెలుగు సినిమాలో సంక్రాంతి నేప‌థ్యంలో వ‌చ్చే ఓ సూపర్ హిట్ సాంగ్. ప్ర‌తి ఏటా సంక్రాంతికి తెలుగు లోగిళ్ల‌లో కొత్త అల్లుళ్లు - కోడిపందేలు - గొబ్బెమ్మ‌లు - ప‌తంగులు......వీటితో పాటు కొత్త సినిమాలు కూడా సందడి చేస్తుంటారు. సంక్రాంతి బ‌రిలో పందెం కోళ్ల లాగానే.....పోటాపోటీగా సినిమాలు కూడా విడుద‌ల‌వుతుంటాయి. టాలీవుడ్ లో కొంద‌రు హీరోల‌కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుటైంది. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య బాబు దాదాపుగా ప్ర‌తి సంక్రాంతికి త‌న సినిమా విడుద‌ల‌య్యేలా చూసుకుంటారు. ఈ సంక్రాంతి బ‌రిలో బాల‌య్య బాబు జై సింహాతో పాటు....ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌చ్ అవెయిటెడ్ మూవీ అజ్ఞాత‌వాసి కూడా విడుద‌ల కాబోతోంది. దీంతోపాటు సూర్య న‌టించిన `గ్యాంగ్`- రాజ్ త‌రుణ్ `రంగుల‌రాట్నం` కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయ్యాయి.

అయితే, ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల కాబోతోన్న సినిమాల సంఖ్య గ‌త రెండేళ్ల‌తో పోలిస్తే త‌క్కువేన‌ని చెప్ప‌వ‌చ్చు. విడుద‌ల కాబోతోన్న నాలుగు సినిమాల‌లో ప‌వ‌న్  - బాల‌య్య ల మ‌ధ్యే ప్ర‌ధాన‌ పోటీ ఉండ‌వ‌చ్చు. ఏపీ - తెలంగాణ‌లోని 90 శాతం థియేట‌ర్లలో ఈ రెండు సినిమాలే సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది. సంక్రాంతి బ‌రినుంచి త‌ప్పుకుంద‌నుకున్న ‘గ్యాంగ్’ కూడా సంక్రాంతికే సంద‌డి చేయ‌నుంది. యువి క్రియేషన్స్ - అల్లు అరవింద్ ఈ సినిమాకోసం ఎక్కువ థియేటర్లను ఏర్పాటు చేయ‌బోతున్నార‌ట‌. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ లో తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ కోసం నాగ్ కూడా ఎక్కువ థియేట‌ర్స్ లో రిలీజ్ చేసేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. హైప్ ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు అంద‌రికంటే ముందే 10వ తారీకున `అజ్ఞాత‌వాసి` విడుద‌ల కానుండ‌డంతో ఆ సినిమాకు మ్యాక్సిమ‌మ్ థియేట‌ర్స్ - స్క్రీన్స్ దొరికే అవ‌కాశ‌ముంది. రెండు రోజుల త‌ర్వాత బాల‌య్య బాబు`జై సింహా`కు కూడా ఎక్కువ సంఖ్య‌లో థియేట‌ర్ల కోసం నిర్మాతలు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే, ఈ థియేట‌ర్లు - స్క్రీన్ల పోటీని త‌ట్టుకొని ఏ సినిమా ఎంతెంత క‌లెక్ట్ చేస్తుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News