పొద్దున్నే థియేటర్ కు పరుగులు తీయాల్సిన అవసరం లేనట్లే

Update: 2022-05-13 05:37 GMT
రాత్రి  ఎన్ని గంటలకు నిద్ర పోయినా సరే.. ఉదయం ఐదు గంటలకు లేచి హడావుడిగా థియేటర్లకు పరుగులు తీసే అలవాటు గడిచిన మూడు నెలలుగా నడుస్తూనే ఉంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇండస్ట్రీకి పట్టిన ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితులు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్ తో మొదలైన పెద్ద సినిమాల సందడి.. నిన్న (గురువారం, మే 12) విడుదలైన సర్కారు వారి పాటతో ముగిసినట్లుగా చెప్పాలి. కనుచూపు మేరలో పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది వెంకీ నటించిన ఎఫ్ 3 మాత్రమే.

అది మినహా ఇప్పట్లో అగ్ర నటులు నటించిన సినిమా విడుదల అయ్యే సూచనలు లేవు. వేగంగా షూటింగ్ లు జరిగితే తప్పించి.. మరో ఆరేడు నెలల వరకు పెద్ద సినిమాల జోరు లేనట్లే. ఏది ఏమైనా.. అగ్ర హీరోల చరిష్మానే వేరు. వారు నటించిన సినిమా విడుదల అవుతుందంటే ఉండే ఊపు.. ఉత్సాహం మరెప్పుడు కనిపించదు. స్టార్ నటులు నటించిన సినిమా విడుదల ఒక పండుగకు ఏ మాత్రం తగ్గదు. కరోనా కారణంగా విడుదలకు దూరంగా ఉన్న పెద్ద సినిమాలన్నీ వరుస పెట్టి రిలీజ్ కావటం తెలిసిందే.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భీమ్లానాయక్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ప్రభాస్ రాధేశ్యామ్.. ఆచార్య.. బీస్ట్.. కేజీఎఫ్.. తాజాగా సర్కారు వారి పాట. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు విడుదలైనా.. ఈ పెద్ద సినిమాలుగా వీటికున్న క్రేజ్ వేరే లెవల్. బీస్ట్.. కేజీఎఫ్ 2 మినహాయిస్తే మిగిలిన సినిమాలన్నీ స్ట్రైయిట్ సినిమాలే. వీటికోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులు ఎంతో ఆశగా.. ఆసక్తిగా ఎదురుచూశారు.

 తమకెన్ని పనులు ఉన్నా.. ఈ సినిమా విడుదల రోజున పొద్దు పొద్దున్నే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు. దీంతో.. మూడు నెలల వ్యవధిలో విడుదలైన భారీ సినిమాల కారణంగా థియేటర్లు కళకళలాడింది. అయితే.. వీటి ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికి.. తెలుగు సినిమా స్టామినా ఏమిటి? సినిమా బాగుండే కలెక్షన్ల వర్షం ఏ స్థాయిలో కురుస్తుందన్న విషయాన్ని ఈసినిమాలు చెప్పేశాయి.

మహేశ్ నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమాలతో పెద్ద హీరోల సినిమాల పండుగ పూర్తి అయినట్లే. ఇప్పట్లో విడుదల కావాల్సిన సినిమాలు లేవు. పెద్ద సినిమాలు అన్నంతనే.. ఐదో షో కోసం పర్మిషన్లు.. అర్థరాత్రి దాటిన తర్వాత ఫ్యాన్స్ షో.. టికెట్ ధరను మరింత పెంచటం లాంటివెన్నో. సినిమాల్ని అభిమానించే వారికి ఫిబ్రవరి చివరి వారం మొదలుకొని.. మే రెండు వారం మధ్య వరకు భారీగానే ఖర్చుచేయాల్సి వచ్చింది.

ఇక.. మరో ఆరేడు నెలల వరకు అలాంటి పరిస్థితి లేనట్లే. పెద్ద సినిమాలు పూర్తి అయితే తప్పించి మళ్లీ థియేటర్ల వద్ద సందడి కనిపించదు. రెండేళ్లుగా తీసుకున్న విశ్రాంతిని పక్కన పెట్టేసి.. పెద్ద హీరోలంతా షూటింగ్ లలో బిజీ బిజీ అయితే తప్పించి.. పొద్దుపొద్దున్నే హడావుడిగా లేచి థియేటర్లకు పరుగులు తీసే అవకాశం లేదు. ఇప్పుడు బంతి పెద్ద హీరోల కోర్టులో ఉంది. మరెవరు ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.
Tags:    

Similar News