రేస్‌ లో టాప్ 5 పాన్ ఇండియా సౌత్‌ డైరెక్ట‌ర్స్

Update: 2022-04-26 01:30 GMT
సౌత్ నుంచి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల వెల్లువ కొన‌సాగుతోంది. ఇంత‌కుముందు సౌత్ నుంచి జాతీయ  స్థాయిలో ఒకటి రెండు పేర్లే వినిపించేవి. రోబో శంక‌ర్ తో పాటు మురుగ‌దాస్ గురించిన చ‌ర్చ సాగేది. ఆ త‌ర‌వాత బాహుబ‌లి తో రాజ‌మౌళి దూసుకొచ్చారు. బాహుబ‌లి -1 - బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌న విజ‌యాల‌తో రాజ‌మౌళి ఇప్పుడు దేశంలోనే నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా వెలిగిపోతున్నారు. ఇత‌ర పాన్ ఇండియా డైరెక్ట‌ర్లు అంతా రాజ‌మౌళి ప‌నిత‌నానికి సాహో అనేస్తున్నారు.

అయితే పాన్ ఇండియా రేసింగ్ అంటే ఆ ముగ్గురేనా? అంటే కానేకాదు. సౌత్ నుంచి అంత‌కంత‌కు పాన్ ఇండియా రేస్ పెరుగుతోంది. రేస్ లో ద‌ర్శ‌కుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. రాజ‌మౌళి త‌ర‌వాత ఇప్పుడు కేజీఎఫ్ ఫ్రాంఛైజీ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పేరు మార్మోగిపోతోంది. కేజీఎఫ్ 2 చిత్రంతో 1000 కోట్ల క్ల‌బ్ ని సాధించిన దర్శ‌కుడిగా అత‌డి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అయితే పాన్ ఇండియా క్ల‌బ్ లో ఇత‌ర ద‌ర్శ‌కులు ఎవ‌రున్నారు? అన్న‌ది చూస్తే.. ఇంత‌కుముందు సైరా-న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కించి  సురేంద‌ర్ రెడ్డి తాను కూడా ఆ రేంజు సినిమా తీయ‌గ‌ల‌న‌ని నిరూపించారు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సైరాకు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇటీవ‌ల  పుష్ప - ది రైజ్ చిత్రంతో సుకుమార్ కూడా పాన్ ఇండియా రేస్‌ లోకి దూసుకొచ్చాడు. పుష్ప సీక్వెల్ తో మ‌రోసారి అత‌డు స‌క్సెస్ సాధించి పాన్ ఇండియా మార్కెట్లో మ‌రో మెట్టు ఎక్క‌డం ఖాయం అన్న చ‌ర్చ సాగుతోంది. ఇక షారూక్ ఖాన్ తో సినిమా చేస్తున్న అట్లీ కూడా పాన్ ఇండియా రేస్ లో స‌త్తా చాటే రేంజ్ త‌న‌కు ఉంద‌ని నిరూపిస్తున్నాడు. షారూక్ సినిమాతో అత‌డు పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు.

అలాగే పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో సినిమా చేస్తున్నాడు కాబ‌ట్టి ఓంరౌత్ కూడా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా నిరూపించుకునేందుకు ఛాన్స్ ఉంది. ఇక రాజ్ కుమార్ హిరాణీ- భ‌న్సాలీ- రోహిత్ శెట్టి -జోయా అక్త‌ర్- క‌ర‌ణ్ జోహార్ వంటి అసాధార‌ణ ప్ర‌తిభావంతులైన‌ డైరెక్ట‌ర్లు కేవ‌లం హిందీ హీరోల‌తోనే ప‌ని చేస్తారు కాబ‌ట్టి వారికి పాన్ ఇండియా చిక్క‌డం అనేది ఇప్ప‌టికి ఫ‌జిల్ గా నే మారింది. మునుముందు వీరంతా మెట్టు దిగి వ‌చ్చి సౌత్ పాన్ ఇండియా స్టార్ల‌తో సినిమాలు చేస్తే అది మారుతుందేమో చూడాలి.

సౌత్ సినిమాల‌కు ఉత్త‌రాది జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న‌ క్ర‌మంలో అనూహ్యంగా పాన్ ఇండియా రేస్ లో ప్రాంతీయ హీరోల హ‌వా కొన‌సాగుతోంది. అలాగే  ప్రాంతీయ ద‌ర్శ‌కులు కూడా దూసుకెళుతున్నారు. ఎంపిక చేసుకునే క‌థ‌ల్లో యూనివ‌ర్శ‌ల్  అప్పీల్ తో పాటు సాంకేతికంగా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో సినిమాల్ని తెర‌కెక్కిస్తున్నారు వీళ్లంతా. బ‌డ్జెట్టు కేటాయిస్తే హాలీవుడ్ ని ఢీకొట్టే సినిమాల్ని తీయ‌గ‌ల స‌త్తా త‌మ‌కు ఉంద‌ని నిరూపిస్తున్నారు. బాలీవుడ్ టా ప్  డైరెక్ట‌ర్ల‌కే మింగుడుప‌డ‌ని రీతిలో మ‌న  డైరెక్ట‌ర్స్ సాధిస్తున్న విజ‌యాలు ఇప్పుడు వ‌ర‌ల్డ్‌ వైడ్ భార‌తీయ‌ డ‌యాస్పోరాలో హాట్ టాపిగ్గా మారింది.
Tags:    

Similar News