ప్లాప్ లకూ ఈ ట్రెండింగ్‌ లు అవసరమా భయ్యా?

Update: 2021-09-28 09:30 GMT
ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయంలో అయినా కూడా సోషల్‌ మీడియాలో ఆ సందర్బానుసారంగా హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ ట్యాగ్స్ కొన్ని చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో స్టార్‌ హీరోల అభిమానులు ప్రతి సందర్బాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్స్ తో తమ హీరోను ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంచే ఉద్దేశ్యంతో కొన్ని చెత్త విషయాల హ్యాష్ ట్యాగ్స్ ను కూడా షేర్‌ చేస్తూ ఉంటారు. ప్రతి హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి.. కొన్ని సినిమాలు మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. ప్రతి హీరోకు కూడా ప్లాప్ లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేయడంలో తప్పులేదు. కాని ప్లాప్ అయిన సినిమా ను ప్రతి ఏడాది గుర్తు చేస్తూ హ్యాష్ ట్యాగ్‌ తో ట్రెండ్‌ చేసేందుకు ప్రయత్నించడం ఆ హీరో కు మరియు ఆ హీరో అభిమానులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొందరు అభిమానులు ఆ చెత్త సినిమాల హ్యాష్ ట్యాగ్స్ ను షేర్ చేస్తే మరి కొందరు మాత్రం ప్లాప్‌ సినిమాలకు ట్రెండింగ్‌ ఎందుకు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు డిజాస్టర్ మూవీ స్పైడర్ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా #4Yearsforspyder హ్యాష్‌ ట్యాగ్‌ ను తెగ ట్రెండ్‌ చేస్తూ ఆ సినిమా విశేషాలను కొందరు అభిమానులు ట్విట్టర్ లో షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం లో ఎస్ జే సూర్య విలన్ గా నటించిన స్పైడర్ సినిమా మరీ దారుణమైన పరాజయం పాలయ్యింది. సినిమా లో విలన్‌ లను చూపించిన తీరు.. క్లైమాక్స్ లో ఆసుపత్రి సన్నివేశం సినిమా మరీ దారుణ ఫలితాన్ని చవిచూసేలా చేసింది. మహేష్‌ బాబు కెరీర్‌ లో ఇలాంటి ఒక డిజాస్టర్ వస్తుందని అభిమానులు ఊహించలేదు. మహేష్‌ బాబు ఎలా ఈ కథను ఎంపిక చేసుకున్నాడని కొందరు. దర్శకుడు మురుగదాస్‌ ఎలా ఈ కథను మహేష్‌ బాబు తో చేయాలని అనుకున్నాడు అంటూ మరి కొందరు ఆ సమయంలోనే ఈ సినిమా పై విమర్శలు చేశారు. సినిమా విడుదల ముందు నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుంది. బాహుబలి కంటే కూడా అధికంగా కొన్ని చోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అంతా ముక్కున వేలేసుకునేలా చేసింది. తమిళనాట కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. అప్పటి వరకు బాహుబలి కాకుండా మరే సినిమా కూడా తమిళనాట అంత భారీ మొత్తానికి అమ్ముడు పోలేదు. భారీ అంచనాల నడుమ తెలుగు మరియు తమిళంలో విడుదల అయిన స్పైడర్ సినిమా తీవ్ర నిరాశ పర్చింది. ఆ సమయంలో మహేష్‌ బాబు అభిమానులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. సరే సినిమా పోయిందేదో పోయింది అనుకోకుండా ప్రతి ఏడాది సినిమా గురించి సోషల్‌ మీడియాలో మళ్లీ మళ్లీ ట్రెండ్‌ చేయడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నారు.

సెప్టెంబర్‌ 27వ తారీకున స్పైడర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున హ్యాష్‌ ట్యాగ్‌ సందడి చేస్తూ స్పైడర్ గాయాన్ని రేపుతూనే ఉంటుంది. ఎంతో మంది అభిమానులు ఆ బాధ నుండి తేరుకుందాం అనుకుంటూ ఉండగా మళ్లీ మళ్లీ దాన్ని రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. మహేష్ బాబు సినిమా ప్లాప్ అయినా కూడా మురుగదాస్ పై తనకు ఉన్న గౌరవం తగ్గలేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన కూడా ప్లాప్ విషయంలో చాలా ఫీల్ అయ్యారు. ఆ ప్లాప్ ను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ఎందుకు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ హిట్‌ అయిన సినిమా లకు ఇలా వార్షికోత్సవ హ్యాష్‌ ట్యాగ్‌ లు ట్రెండ్‌ చేయడం మంచిదే కాని ప్లాప్ అయిన సినిమా చాలా మందికి ఇబ్బందిని బాధను కలుగ జేస్తుందని.. అందుకే ఇకపై అయినా ఏ హీరో అభిమానులు అయినా ప్లాప్‌ మూవీ సినిమాలకు సంబంధించిన హ్యాట్ ట్యాగ్స్ ను షేర్‌ చేయవద్దని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు కోరుకుంటున్నారు. కాని అభిమానులు ఎవరి మాట వినే పరిస్థితి కనిపించదు. ప్రతి హీరో అభిమానుల్లో కొందరు జనాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా తమ హీరో ను సోషల్‌ మీడియాలో ట్రెండ్ చేయాలనే ఉద్దేశ్యంతో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు.
Tags:    

Similar News