ట్రెండీ టాక్‌: ఆయ‌న మార‌డు!

Update: 2018-08-18 04:36 GMT
ఇన్నాళ్లు హీరోలు -  హీరోయిన్ల‌కు మాత్ర‌మే ఆన్ లొకేష‌న్‌ కార‌వ్యాన్ అవ‌స‌రం ఉండేది. కానీ ఇప్పుడు అది డైరెక్ట‌ర్లు - మ్యూజిక్ డైరెక్ట‌ర్లకు అవ‌స‌రం అవుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. లొకేష‌న్‌ ని అత్తారిల్లుగా మార్చుకునే సంస్కృతి పెరుగుతోంద‌న్న కామెంట్లు మునుముందు వినిపించే ప‌రిస్థితి ఉంది. అందుకు ఇదిగో ఇదే తాజా ఎగ్జాంపుల్‌.

`అర‌వింద స‌మేత` ఆన్ లొకేష‌న్ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ కి త్రివిక్ర‌ముడు కార‌వ్యాన్ సెట‌ప్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని త‌మ‌న్ ఎంతో సంబ‌రంగా ట్వీట్ చేశాడు. ఇదిగో `ఇదే నా స్పెష‌ల్ కార‌వ్యాన్` అంటూ త‌మ‌న్ ట్వీట్ చేసేప్ప‌టికి అది విన్న జ‌నాల‌కు మాత్రం అదేదో వింతైన అల‌వాటులా - వింతైన సౌండింగుతో వినిపించింది. వాస్త‌వానికి సంగీత ద‌ర్శ‌కుడికి ఆన్ లొకేష‌న్ అంత అవ‌స‌రం ఏం ఉంటుంది? అంటూ ఫిలింన‌గ‌ర్ జ‌నం చెవులు కొరుక్కుంటున్నారు.

అస‌లే త్రివిక్ర‌మ్ ఫ్లాపుకొట్టి హైరానా ప‌డుతున్నాడు. `అజ్ఞాత‌వాసి` రిజ‌ల్ట్ అటు నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింద‌న్న రిపోర్ట్ అప్ప‌ట్లో అందింది. ఓవ‌ర్‌ బ‌డ్జెట్లు - కాస్ట్ ఫెయిల్యూర్స్ నిర్మాత‌ల్ని ముంచేస్తున్న స‌న్నివేశం ఉంది. ఈ నేప‌థ్యంలో న‌ష్టాల్ని నిర్మాత‌లే కొంత‌వ‌ర‌కూ భ‌ర్తీ చేయాల్సి వ‌స్తోంది. అక్క‌ర్లేని వాటికి `మీసాల‌కు సంపెంగ నూనె`లా ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా? అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదేనా? అంటూ త్రివిక్ర‌మ్‌ పై పంచ్‌ లు ప‌డిపోతున్నాయ్‌. సాధ్య‌మైనంత వ‌ర‌కూ అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌గ్గించి నిర్మాత‌ల ద‌ర్శ‌కుడిగా ఉంటేనే ఈరోజుల్లో గౌర‌వం. మ‌రి ఆ ఫార్ములాని తుంగ‌లో తొక్కేసారా? అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్‌. మ‌రి వీటికి అట్నుంచి ఏం స‌మాధానం ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News