త్రివిక్రమ్ ఈ టైపు సినిమాలే చేసుకోవాలా?

Update: 2018-10-14 02:10 GMT
ప్రతి పదేళ్లకు సినిమాల్లో పెద్ద మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య టాలీవుడ్లో అలాంటి మార్పే వచ్చినట్లు కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రధానంగా తెలుగులో ఎంటర్టైనర్లు తెరకెక్కేవి. హీరోలు సైతం కామెడీ బాట పట్టి ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఐతే గత కొంత కాలంగా తెలుగు సినిమా ‘సీరియస్’ టర్న్ తీసుకుంది. ఎంటర్టైన్మెంట్ గురించి పెద్దగా ఆలోచించకుండా సీరియస్ కథల్ని చెప్పడం మొదలుపెట్టారు దర్శకులు. ప్రేక్షకులు కూడా అలాంటి కథలకు బ్రహ్మరథం పడుతున్నారు. ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ ఈ కోవలోనే మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ‘అరవింద సమేత’ సైతం సీరియస్ సినిమానే. ఇది కూడా పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది.

విశేషం ఏంటంటే.. ‘అరవింద సమేత’ లాంటి సీరియస్ మూవీని వినోదానికి కేరాఫ్ అడ్రస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయడం. రచయితగా ఉన్నప్పట్నుంచి కామెడీ ఎంటర్ టైనర్లకు త్రివిక్రమ్ పెట్టింది పేరు. ‘అతడు’ కథ పరంగా సీరియస్ అయినా కూడా దాన్ని ఆయన వినోదాత్మకంగానే నడిపించారు. కొన్నిసార్లు త్రివిక్రమ్ సినిమాల్లో ఈ కామెడీ టచ్ ఎక్కువ కావడం వల్ల కొన్ని సీరియస్ కథలు కూడా చెడిపోయాయి. జల్సా.. ఖలేజా లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు త్రివిక్రమ్. కానీ ఇప్పుడు తన బలమైన వినోదాన్ని త్రివిక్రమ్ విడిచిపెట్టాడు. ‘అరవింద సమేత’లో ఓ సీరియస్ కథను ఇంటెన్సిటీతో చెప్పాడు. ఎమోషన్లను బాగా పండించాడు. గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో ఏదైతే పెద్ద ప్లస్ అయ్యేదో అది ఇందులో మైనస్ అయింది. ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసిన ట్రాక్ మొత్తం నిస్సారంగా మారింది. అసలేమాత్రం నవ్వించలేకపోయాడతను. ఇక ఇందులో హీరో ఎలివేషన్ సీన్లు.. ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండాయి. ఆల్రెడీ ‘అజ్ఞాతవాసి’లోనూ త్రివిక్రమ్ వినోదం పండించలేకపోయాడు. చూస్తుంటే.. ఇక వినోదం వదిలేసి ఇలా సీరియస్ గా కథలు చెబుతూ పోతేనే త్రివిక్రమ్ సక్సెస్ అవుతాడేమో.
Tags:    

Similar News