'పుష్ప' వసూళ్ళతో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఉదయభాను..!

Update: 2021-12-22 07:32 GMT
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''పుష్ప: ది రైజ్''. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 173 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇకపోతే 'పుష్ప' పార్ట్-1 సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మంగళవారం తిరుపతిలో గ్రాండ్ గా ఈవెంట్ చేశారు. సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ఈ సందర్భంగా టీమ్ మొత్తం కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలం తర్వాత ఈ కార్యక్రమానికి సీనియర్ యాంకర్ ఉదయభాను హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.

అయితే 'పుష్ప' సినిమా వసూళ్ల గురించి గొప్పగా చెప్పే క్రమంలో కాస్త తడబాటుకు గురై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయింది. 'పుష్ప' పార్ట్-1 మూవీ కేవలం 4 రోజుల్లో ₹ 2003 కోట్ల రికార్డ్ గ్రాస్ ని కలెక్ట్ చేసిందని ఉదయభాను పేర్కొన్నారు. 203 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చెప్పడానికి బదులు ఉదయభాను ఈ నంబర్ ని చెప్పినట్లు తెలుస్తోంది.

ఉదయభాను టంగ్ స్లిప్ అయిన వీడియో క్లిప్పింగ్ ని నెటిజన్స్ అప్పుడే ఇంటర్నెట్ లో షేర్ చేసి క్షణాల్లో వైరల్‌ చేశారు. చిత్ర బృందాన్ని మరియు యాంకర్ ని ట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. 'పుష్ప 1' కేవలం నాలుగు రోజుల్లో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కార్యక్రమాల్లో ఇలాంటి టంగ్ స్లిప్ సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత స్టేజి మీదకు వచ్చిన యాంకర్ ఉదయభాను వల్ల 'పుష్ప' ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా 'పుష్ప: ది రైజ్' నార్త్ మార్కెట్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఫస్ట్ డే ఓ మోస్తరు వసూళ్ళు రాబట్టిన ఈ సినిమా.. అందరి అంచనాలను తలక్రిందులు చేసే నంబర్స్ నమోదు చేస్తోంది. మొదటి రెండు రోజుల కంటే 5వ రోజు ఎక్కువ గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. శుక్రవారం 3.11 కోట్లు - శనివారం 3.55 కోట్లు - ఆదివారం 5.18 కోట్లు - సోమవారం 4.25 కోట్లు - మంగళవారం 4.05 కోట్లు అందుకున్న 'పుష్ప' హిందీ వెర్సన్.. ఐదు రోజుల్లో మొత్తం ₹ 20.14 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. మరి లాంగ్ రన్ లో ఈ మూవీకి ఎలాంటి వసూళ్ళు దక్కుతాయో చూడాలి.

కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించగా.. రష్మిక మందన్నా అతనికి జోడీగా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండో భాగం 'పుష్ప: ది రూల్' వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


Tags:    

Similar News