కృతజ్ఞత లేదంటూ స్టార్ హీరోయిన్ పై ట్రోల్స్..!

Update: 2022-11-11 04:06 GMT
'కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో హీరయిన్ గా పరిచయమైన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ఛలో చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో ఛలోమంటూ దూసుకెళ్లిన ఈ భామ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగుపెట్టి ఫుల్ బిజీగా మారిపోయింది.

రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం 'కిరిక్ పార్టీ' లో హీరోయిన్ గా అవకాశం ఎలా వచ్చిందో ఆమె వివరించింది. కాలేజీలో చదువుతున్నప్పుడు తాను కొంత మోడలింగ్ చేశానని.. టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో తన ఫోటో ఒకటి ప్రచురితమైందని చెప్పింది. అది చూసి ప్రొడక్షన్ హౌస్ నుండి ఫోన్ చేసి సినిమా ఆఫర్ చేశారని.. అలా ఫస్ట్ ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

అయితే ఇక్కడ రష్మిక తనకు తొలి అవకాశం ఇచ్చిన బ్యానర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కిరిక్ పార్టీ చిత్రం ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో.. అతని సోదరుడు కాంతారా ఫేం రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే వాళ్ళిద్దరి పేర్లను నేషనల్ క్రష్ ప్రస్తావించకపోవడాన్ని సోషల్ మీడియాలో తప్పుబడుతున్నారు.

రష్మిక ఇప్పుడు ఎలాంటి పొజిషన్ లో వున్నా ఆమె తన మూలాలను మరచిపోకూడదని.. అవకాశం ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు కృతజ్ఞత లేదని ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేథ్యంలోనే రష్మిక ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కెరీర్ ప్రారంభం నుంచి కొంతమంది నెటిజన్ల నుంచి ఎదురైన నెగెటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ గురించి రాసుకొచ్చింది. తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి చాలా ద్వేషానికి గురవుతున్నానని.. చాలా ట్రోల్లు మరియు ప్రతికూలత ఎదుర్కొన్నానని పేర్కొంది.

గత కొన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల నుంచి కొన్ని విషయాలు నాకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితం చేయవలసిన పని.

నా కెరీర్ ని మొదలు పెట్టినప్పటి నుండి నేను చాలా ద్వేషానికి గురవుతున్నాను. నా మీద చాలా ట్రోలింగ్స్ , నెగిటిటీని వ్యాప్తి చేస్తున్నారు. నేను ఎంచుకున్న జీవితం విలువైనదని నాకు తెలుసు. ప్రతీ ఒక్కరికీ నేను నచ్చాలని ఏమీ లేదు. మిమ్మల్నందరినీ సంతోషంగా ఉంచడానికి నేను చేసే పని మాత్రమే నాకు తెలుసు. నా పని ద్వారా మీరు పొందే ఆనందాన్ని మాత్రమే నేను ఎక్కువగా పట్టించుకుంటున్నాను. మీరు, నేను గర్వించే విషయాలను బయట పెట్టేందుకు నిజంగా నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నా.

ముఖ్యంగా నేను వెల్లడించని విషయాల కోసం ఇంటర్నెట్ లో నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు హృదయ విదారకమైన స్థితిలోకి వెళ్లిపోయి.. నిరుత్సాహానికి గురవుతున్నాను. నేను ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్ని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయని తెలుసుకున్నా. ఇండస్ట్రీలో లేదా బయట నాకున్న సంబంధాలకు హాని కలిగించే తప్పుడు కథనాలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంటాయని రష్మిక మంధన్నా చెప్పుకొచ్చింది.

నిర్మాణాత్మక విమర్శలు బాగుంటాయి. ఉత్తమంగా కెరీర్ ను డిజైన్ చేసుకునేందుకు అవి సహాయపడతాయి. కానీ ఈ రకమైన నెగెటివిటీ, తప్పుడు స్టేట్మెంట్స్ నన్ను అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మొదటి నుంచి నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు.. నేను మీ కోసం కష్టపడి పని చేస్తూనే ఉంటాను అంటూ తన పోస్టులో రష్మిక రాసుకొచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News