బొంబాయి క‌రోనాలు కోట్లు నొల్లాయి...అస‌లేమీ విదిల్చ‌వా?

Update: 2020-03-30 20:30 GMT
మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి ల‌క్కీగా  స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారెంద‌రో. స‌గానికి పైగా టాలీవుడ్ ని ఏల్తోంది ముంబై నుంచి దిగుమ‌తైన భామ‌లే. ఇక మిగిలిన భామ‌లంగా బెంగుళూరు..మంగుళూరు.. చెన్న‌య్‌.. దిల్లీ...పంజాబ్..  వీళ్ల‌దే హ‌వా. ఒక్క టాలీవుడ్ లో వ‌చ్చిన గుర్తింపుతో  కోట్లలో సంపాదిస్తున్నారు. సినిమా జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా నిర్మాత ముక్కు పిండి మ‌రి వ‌సూలు  చేస్తారు. ముంబై నుంచి టాలీవుడ్ కి దిగ‌మ‌తి అయ్యే ముంబై భామ‌ల ఖ‌ర్చు అయితే నిర్మాత‌లకు త‌డిపి మోపుడ‌వుతున్నా ఆ భారం అలానే మోస్తుంటారు. స్టార్ డ‌మ్ రానంత వ‌ర‌కే.. వ‌చ్చాక  రూ.3-5 కోట్ల‌కు త‌క్కువ కాకుండా పారితోషికాలు ఛార్జ్ చేస్తారు. ఆ విష‌యం ప‌క్క‌న‌బెటితే ఆ హీరోయిన్ వెనుక వ‌చ్చే స్టాప్ ఖ‌ర్చు ఎంతో  తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.

ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే ..స్టార్ డ‌మ్ ఉన్న ముంబై భామ‌కు 5 స్టార్ హోట‌ల్ లో రూమ్ బుక్ చేయాలి. ఒక రోజు రూమ్ బిల్లు 7  వేల నుండి 15 వేలు మ‌ధ్య‌లో ఉంటుంది. ఆ అమ్మ‌డు వెంట వ్య‌క్తిగ‌తంగా ఓ హెయిర్ స్టైలిస్ట్ నేరుగా ముంబై నుంచే వ‌స్తారు. అత‌నికి రోజుకి 10 వేలు పే చేయాలి. అత‌ని కింద ఉండే మేక‌ప్ అసిస్టెంట్ కి 5 వేలు.. చీప్ మేక‌ప్ మేన్ కి 8 నుంచి 10 వేలు మ‌ధ్య‌లో స‌మ‌ర్పించుకోవాలి. ఇంకా కాస్ట్యూమ్ అసిస్టెంట్ కి రోజుకి 4 నుంచి 5 వేలు.. కాస్ట్యూమ‌ర్ కి 10 వేలు... వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడికి 5 నుంచి 8 వేలు రోజుకివ్వాలి. ఇక అమ్మ‌డు కారు డ్రైవ‌ర్ కి 5 వేలు.. భోజ‌నం ఇత‌ర ఖ‌ర్చులు నిర్మాతే భ‌రించాలి. ఇలా ఎలా చూసుకున్నా స్టార్ డ‌మ్ ఉన్న భామ ఒక రోజు ఖ‌ర్చు పారితోషికం కాకుండా ల‌క్ష రూపాయ‌లు దాకా అవుతుంది.

అంటే ఆ హీరోయిన్ ఎన్ని రోజులు ఆ సినిమాకు షూటింగ్ డేస్ కేటాయిస్తుందో అన్ని ల‌క్ష‌లు నిర్మాత నెత్తిన వేసేస్తారుట‌. అందులో రూపాయి త‌గ్గినా ఒప్పుకోరట‌. క‌రోనా లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో  ఈ విష‌యాలు  ఓ స్టార్ హీరోయిన్ మేక‌ప్ అసిస్టెంట్ చెప్పుకుని వాపోయాడు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో సినీ కార్మికులు ప‌నులు లేక పొట్ట పోషించుకోవ‌డానికి నానా ఇబ్బందులు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్  చిరంజీవి సీసీసీ పేరిట ఓ ఛారిటీ స్థాపించి విరాళాలు సేక‌రించే ప‌నిలో ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ చాలా త‌క్కువ మంది హీరోయిన్లే స్పందించారు.

టాలీవుడ్ ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయాలు సంపాదిస్తున్న ఏ స్టార్ హీరోయిన్ కూడా ఇప్ప‌టివ‌ర‌కూ విరాళాలు అందించ‌డానికి ముందుకు రాక‌పోవ‌డం నిజంగా సిగ్గు చేటు అని స‌ద‌రు మేక‌ప్ మేన్ ఆవేద‌న చెందాడు. వాళ్ల క‌డుపు నిండితే చాలు...ప‌క్కోళ్ల క‌డుపు కాలి చ‌నిపోయినా ఫ‌ర్వాలేదు అన్న ధోర‌ణిలోనే మ‌న హీరోయిన్లు అంతా ఉన్నార‌ని ఆగ్ర‌హం  చెందాడు. ముఖ్యంగా ముంబై నుంచి దిగుమ‌తైన భామ‌ల‌కు క‌నిక‌రం అనేదే తెలియ‌దంటూ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు రావ‌డం విశేషం.
Tags:    

Similar News