బుల్లితెర‌ న‌టుడు మ‌ధుప్ర‌కాష్‌ భార్య ఆత్మ‌హ‌త్య‌!

Update: 2019-08-07 04:16 GMT
భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య మొద‌లైన చిన్న గొడ‌వ చివ‌రికి భార్య ప్రాణాల్ని హ‌రించి వేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది. టీవీ న‌టుడు మ‌ధు ప్ర‌కాష్ భార్య భార‌తి (34) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గ‌త కొంత కాలంగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌లే భార‌తి ఆత్మ‌హ‌త్య‌కు దారితీశాయ‌ని రాయ‌దుర్గం పోలీసులు చెబుతున్నారు. పోలీసుల‌ క‌థ‌నం ప్ర‌కారం... గుంటూరుకు చెందిన భార‌తికి మ‌ణికొండ పంచ‌వ‌టి కాల‌నీలో నివాసం వుండే టీవీ న‌టుడు మ‌ధు ప్ర‌కాష్‌ కు 2015లో వివాహం జ‌రిగింది.  న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ సంస్థ‌లో భార‌తి ఉద్యోగం చేస్తూ భ‌ర్త‌ - అత్తామామ‌లు - మ‌రిదితో క‌లిసి వుంటున్నారు.

అయితే గ‌త కొంత కాలంగా టీవీ షూటింగ్‌ ల కార‌ణంగా భ‌ర్త ఇంటికి ఆల‌స్యంగా వ‌స్తున్నారు. ఇది భార‌తికి న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌ర‌చూ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం కూడా ఆల‌స్యంగా ఇంటికి రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌దిగంట‌ల‌కు జిమ్‌ కు వెళ‌తాన‌ని చెప్పి మ‌ధుప్ర‌కాష్ అటు నుంచి అటే షూటింగ్‌కు  వెళ్లిపోయాడు. దీంతో ఆగ్ర‌హించిన భార‌తి భ‌ర్త‌కు వీడియో కాల్ చేసి తాను ఉరివేసుకుంటున్న‌ట్టు బెదిరించింది. అయితే య‌దావిధిగా షూటింగ్ ముగించుకుని రాత్రి 7.30కి ఇంటికి వ‌చ్చిన మ‌ధు ప్ర‌కాష్ త‌న భార్య భార‌తి గ‌దికి వెళ్లి చూశారు. లోప‌లి నుంచి గ‌డియ‌పెట్టి వుండ‌టం.., ఎంత‌కీ తీయ‌క‌పోవ‌డంతో త‌న వ‌ద్ద వున్న మ‌రో తాళంతో గ‌ది త‌లుపులు తీసి చూసేస‌రికి చీర తో భార‌తి ఉరివేసుకుని మ‌ర‌ణించి క‌నిపించారు.

భార‌తి ఆత్మ‌హ‌త్య స‌మ‌యంలో మ‌రిది ఇంట్లో లేరు. అలానే అత్త మామ‌లు వేరే గ‌దిలో ఉంటున్నార‌ని పోలీసులు తెలిపారు.  ప్ర‌స్తుతం పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News