89 కాదు.. ఒకే కట్ తో లైన్ క్లియర్

Update: 2016-06-13 12:25 GMT
ఉడ్తా పంజాబ్ సెన్సార్ వివాదంపై తుది తీర్పును బాంబే హైకోర్టు వెల్లడించింది. ముందుగా కోర్టులో వాదోపవాదనలు జరిగినట్లుగానే.. ఒకే కట్ తో విడుదలకు అనుమతిని ఇచ్చింది కోర్టు. ఈ మేరకు 2 రోజుల్లో కొత్త సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా సీబీఎఫ్సీకి అనుమతులు కూడా జారీ చేసింది. ఈ తీర్పుపై స్టే విధించాలని సెన్సార్ బోర్డ్ కోరినా.. అందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం.

కోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అంటున్నాడు అనురాగ్ కశ్యప్ తరపు లాయర్. ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ జూన్ 17కు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని నిర్మాత తెలిపాడు. అయితే తీర్పు సందర్భంగా కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. రాజ్యాంగ నిబంధనలు - సుప్రీం అదేశాలకు అనుగుణంగానే సీబీఎఫ్సీ చర్యలు ఉండాలని.. సీన్స్ ను కట్ చేయడం - తొలగించడం - మార్పులకు ఆదేశించడం కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఇదే సమయంలో ఫిలిం మేకర్ క్రియేటివిటీని - సినిమాలో ఉండే కంటెంట్ ని ఎవరూ నిర్దేశించరాదని.. సృజనాత్మక స్వేచ్ఛకు భంగం కలిగించరాదని కోర్టు వ్యాఖ్యానించడం విశేషం.

దీనికి ముందు సెన్సార్ చీఫ్ పంకజ్ నిహ్లానీ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నుంచి పంజాబ్ తొలగించాలని తాము చెప్పామని నిర్మాత చెప్పడాన్ని ఖండించాడు. తాము కేవలం 13 కట్స్ ను మాత్రమే సూచించామని.. ఇదంతా పబ్లిసిటీ కోసం అనురాగ్ కశ్యప్ ఆడుతున్న డ్రామాగా చెప్పాడు నిహ్లానీ.
Tags:    

Similar News