పోల‌వ‌రంపై కేంద్రం కొత్త స్టేట్‌మెంట్‌

Update: 2016-05-05 13:17 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా త‌ర్వాత అంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోలవరం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం తాజాగా మ‌రోమాట చెప్పింది. ఢిల్లీలో కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని ప్ర‌క‌టించారు. అయితే ఆర్ధికపరమైన అంశాల పట్ల ఆర్థికశాఖతో త‌న ప‌రిధిలోని జలవనరుల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని అన్నారు. 70:30 శాతం నిధుల నిష్పత్తిపై ఆర్థిక శాఖ - ప్రధాని కార్యాలయానికి వివరణ ఇచ్చామని ఆమె తెలిపారు.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించామని ఉమాభార‌తి అన్నారు. ఒడిశా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం చెబుతోందని, ఆ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని, ఇప్పటికే వివరించామని ఆమె వెల్లడించారు. మరోసారి వారిని పిలిపించుకుని మాట్లాడతామని ఆమె తెలిపారు. ఇదే విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ‌తో సైతం మాట్లాడుతున్న‌ట్లు తెలిపారు.

కేంద్ర మంత్రి ఉమాభార‌తి చెప్పిన మాట‌లు ఆంధ్రప్ర‌దేశ్‌ కు సంతోషం క‌లిగించేవే అయిన‌ప్ప‌టికీ...గ‌తంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో కూడా ఇలాగే చెప్పి ఇపుడు మాట‌మార్చిన సంద‌ర్భాన్ని గుర్తుచేస్తున్నారు. నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తూనే బొటాబొటిగా విడుద‌ల చేయ‌డంపై కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్ర‌క‌ట‌న విష‌యంలో అయిన కేంద్రం నిల‌బ‌డుతుందా అనే సందేహాన్ని ప‌లువురు ఇప్ప‌టికే ప్రారంభించారు కూడా!
Tags:    

Similar News