విరుగుడులేని విలనిజం .. విధి రాసిన విషాదం .. రాజనాల

Update: 2021-06-12 00:30 GMT
రాజనాల .. అలనాటి సినిమాలు చూసినవారికి పరిచయమే అవసరం లేని పేరు. నటన పరంగా రాజనాల అంటే కండలు తిరిగిన దేహం.. గుండెల నిండుగా ద్వేషం .. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు తెరపై ఆయన విరుగుడు లేని విలనిజం. అప్పట్లో సాంఘికాలలోనే కాదు పౌరాణిక .. జానపద చిత్రాలలోను ఆయనే తిరుగులేని విలన్. కళ్లతోనే వీలైనంత విలనిజం పలికించడం ఆయన ప్రత్యేకత. పగ .. ప్రతీకారం ... ద్వేషం .. చూపులతో పలికించడం, కపటత్వాన్ని నవ్వుతో ఆవిష్కరించడం రాజనాల ప్రత్యేకత.

రాజనాల డైలాగ్ డెలివరీ కూడా విభిన్నంగా .. విలక్షణంగా ఉండేది. ఇక సాంఘికాలలో నాయకుడిపై కాలుదువ్వడం .. జానపదాల్లో కత్తిదూయడంలోను ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ కారణంగానే అప్పట్లో ఆయన చాలా బిజీగా ఉండేవారు. తెరపై నాయకుడితో సమానంగా పోటీపడేవారు. జానపదాల్లో వంచనతో సింహాసనం దక్కించుకునే వెన్నుపోటుదారుడి పాత్రల్లో ఆయన జీవించేవారు. ఆ తరహా పాత్రల్లో రాజనాలను ఎవరూ బీట్ చేయలేకపోయారు. అలా స్టార్ విలన్ గా రాజనాల ఒక వెలుగు .. వైభవం చూశారు.

అయితే స్టార్ డమ్ అనేది ఇంద్రధనుస్సు వంటిది. చూసి మురిసిపోయేలోగా మాయమవుతుంది. ఈ లోగా సంపాదించిన డబ్బును జాగ్రత్త చేసుకున్నవారే ఆ తరువాత కాలంలో హాయిగా ఉండగలిగారు. ఆ దూరదృష్టిలేనివారు అనేక రకాలుగా  అవస్థలు పడ్డారు. అలా చివరి రోజుల్లో ఆర్ధికపరంగా ఇబ్బందులు పడినవారిలో రాజనాల కూడా కనిపిస్తారు. అనారోగ్యం ఆయనను మరింత నిస్సహాయుడిని చేసింది. ఒకప్పుడు డేట్లు ఇవ్వడానికి సతమతమైన రాజనాల, ఆ తరువాత అవకాశాల కోసం ఎదురుచూడవలసి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన అభిమానులకు శాశ్వతంగా దూరమయ్యారు. 
Tags:    

Similar News