'అన్ స్టాపబుల్' ప్రోమో: బాలయ్య - రవితేజ గొడవ పై క్లారిటీ..!

Update: 2021-12-21 15:53 GMT
ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ‘అన్‌ స్టాపబుల్’ ఒకటి. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న స్పెషల్ టాక్ షో ఇది. సినీ ప్రముఖులను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్న ఈ కార్యక్రమం.. విశేష ఆదరణ తెచ్చుకుంటోంది. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన ఐదు ఎపిసోడ్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని ట్రెండింగ్ లో నిలిచాయి.

గత ముప్పై ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి సేవలందిస్తున్న బాలకృష్ణ.. 'అన్ స్టాపబుల్' టాక్ షో ద్వారా ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలపై క్లారిటీ ఇస్తున్నారు. గెస్టులను తన ప్రశ్నలతో ఇరుకున పెడుతూనే.. కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. రాబోయే 6వ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో బాలయ్య సంభాషించారు. ఇది క్రిస్మస్ సందర్భంగా ప్రసారం కానుంది. ఇదే క్రమంలో తదుపరి ఎపిసోడ్ కు మాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరు కానున్నారు.

తాజాగా 'అన్ స్టాపబుల్' 7వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని ఆహా టీమ్ రిలీజ్ చేసింది. బాలకృష్ణ ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావిస్తూ లోతైన సమాచారం రాబట్టారని తెలుస్తోంది. బాలకృష్ణతో రవితేజ గొడవ గురించి.. డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం గురించి వెల్లడించిన అంశాలు హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో రవితేజకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బాలకృష్ణ.. 'మొదలు పెట్టే ముందు బాసూ మనం ఓ క్లారిటీ తీసుకోవాలి.. నీకూ, నాకు పెద్ద గొడవ అయిందట కదా?' అని ప్రశ్నించారు. దీనికి పెద్దగా నవ్వేసిన రవితేజ 'పనీ పాటా లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని' అని సమాధానమిచ్చారు. గతంలో వీరి మధ్య గొడవలు జరిగాయనే రూమర్స్ కు ఆహా షో వేదికగా చెక్ పెట్టారని అర్థం అవుతోంది.

ఈ సందర్భంగా 'నీకు కోసం వచ్చినపుడు వాడే నాలుగు బూతులు చెప్పు సరదాగా' అని బాలయ్య అడగ్గా.. 'నేను బూతులు మొదలు పెడితే చేస్తారు కానీ' అని నవ్వుతూ బదులిచ్చారు రవితేజ. 'అతి వినయం ధూర్త లక్షణం.. చేతులు కట్టుకుంటే డిప్ప పగిలిపోయినట్టే' అని బాలకృష్ణ అనగా.. 'అవతల వాడి బిహేవియర్ ని బట్టి వీడు తేడా గాడు అనే విషయం తెలిసిపోతుంది కదా మీకు' అని నవ్విన రవితేజ.. బాలయ్య అలాంటి వారిని చెంప దెబ్బ కొడతారనే విషయాన్ని చూపించారు.

అమ్మాయిలకు లైన్ వేసేవాడివంట కదా అని బాలయ్య అడిగిన ప్రశ్నకు రవితేజ అవాక్కవుతూ.. ఈ విషయాలన్నీ మీకు ఎవరు ఇచ్చారు?' అని అన్నారు. దీనికి బాలకృష్ణ స్పందిస్తూ.. 'మాది కృష్ణా జిల్లాయే బాసూ..' అని నవ్వేశారు. అంతేకాదు తాను చిన్నపుడు అమ్మాయిలకు లైన్ వేసేవాడినని బాలయ్య అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. 'మీ అబ్బాయి నీ కంటే టాలెంట్ కదా' అని అడగ్గా.. 'అందుకే వాడికి DNK అని పేరు పెట్టుకున్నా.. DNK అంటే దొంగ నా కొ*కు' అని రవితేజ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో గతంలో డ్రగ్స్‌ ఆరోపణలతో రవితేజ విచారణ ఎదుర్కొన్న విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు. 'హెల్త్‌ కి ఫిట్‌ నెస్‌ కు ఎంతో వాల్యూ ఇచ్చే నీ మీద డ్రగ్స్‌ కేసు పెట్టారు' అని బాలకృష్ణ అనగా.. 'అందరి కంటే ముందు నాకే ఆశ్చర్యమేసింది. ఎక్కడ బాధ పడ్డానంటే.. పెంట పెంట చేశారు.. అది కొంచెం బాధేసింది' అని రవితేజ చెప్పుకొచ్చారు. దీనికి అవును అన్నట్లు బాలయ్య తలూపారు.

ఇకపోతే ఈ షోలో గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ గతంలో ఓసారి అరెస్ట్ అయ్యావంట కదా అని బాలయ్య ప్రశ్నించారు. 'సమరసింహారెడ్డి' సినిమా విడుదల సమయంలో అరెస్ట్ అయ్యానని దర్శకుడు గోపీచంద్ తెలిపారు. రవితేజ కు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడని.. తనతో చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే కొడతానంటూ గోపీచంద్‌ కు బాలకృష్ణ సరదా వార్నింగ్ ఇవ్వడం నవ్వు తెప్పిస్తోంది. 'ఈసారి లైట్లు సెట్లు లేకుండా.. ఓ చెట్టు కింద కూర్చుని ఓ రౌండ్ వేసుకుందాం.. ఏమంటావ్' అని బాలయ్య అనడంతో ఈ ప్రోమో పూర్తయింది.

రవితేజ - గోపీచంద్ మలినేని లతో నటసింహం జరిపిన ఆసక్తికరమైన సంభాషణలు ఏంటో తెలుసుకోవాలంటే డిసెంబర్ 31వ తేదీ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ 'అన్ స్టాపబుల్' ఎనర్జిటిక్ ఎపిసోడ్ 'ఆహా' లో ఈ ఏడాది చివరి రోజు స్ట్రీమింగ్ అవుతుంది.


Full View
Tags:    

Similar News