ఉపేంద్ర నేరుగా కాంట్రవర్శీతో దిగుతున్నాడు

Update: 2016-06-16 04:37 GMT
సౌత్ ఇండియాలోని విలక్షణ కథానాయకుల్లో ఉపేంద్ర ఒకడు. స్వీయ దర్శకత్వంలో అతను చేసిన ఎ.. రా.. ఉపేంద్ర.. సూపర్ లాంటి సినిమాలు పెద్ద సంచలనాలే. ఈ మధ్యే మళ్లీ మెగా ఫోన్ పట్టి ‘ఉపేంద్ర-2’ తీశాడు కానీ.. అది సరైన ఫలితాన్నివ్వలేదు. ఉపేంద్ర సినిమాలు చాలా వరకు వివాదాలతో ముడిపడి ఉంటాయి. గత ఏడాది ఉపేంద్ర హీరోగా నటించిన ‘శివం’ సినిమా కన్నడనాట పెద్ద వివాదాలకు దారి తీసింది. దీనికి ముందు ‘బసవణ్ణ’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తో పాటు పోస్టర్ల మీద కూడా పెద్ద వివాదం నడిచింది. చివరికి అన్నీ సరిదిద్దుకున్నారు. శివం పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడది ఓ మోస్తరుగా ఆడింది.

‘శివం’ సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. దీనికి ‘బ్రాహ్మణ’ అనే టైటిల్ పెట్టారు. ఇంకేముంది.. వెంటనే వివాదం రాజుకునేలా కనిపిస్తోంది. ఇలా ఓ కులం పేరు పెట్టి సినిమా రిలీజ్ చేయాలంటే అంత సులువు కాదు. ఇప్పటికే బ్రాహ్మణుల్ని సినిమాల్లో కించపరిచేలా చూపిస్తున్నారంటూ టాలీవుడ్లో కొన్ని వివాదాలు నడిచాయి. ఇప్పుడు బ్రాహ్మణ అని పేరు పెట్టి ఓ వయొలెంట్ మూవీ వదిలితే ఎలా ఊరుకుంటారు? బహుశా ఇలా వివాదం చెలరేగితే అది పబ్లిసిటీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాసరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. రాగిణి ద్వివేది కథానాయిక. మరి ఈ టైటిల్ విషయంలో బ్రాహ్మణులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News