సీనియర్ డైరెక్టర్ వంశీ.. సడెన్ గా మళ్లీ బిజీ అయిపోయాడు. సితార - అన్వేషణ లాంటి అద్భుతమైన సినిమాలతో.. తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్న వంశీ.. ఈ మధ్య బాగా స్లో అయ్యాడు. ఎంతగా అంటే.. కనీసం కంప్లీట్ చేసిన మూవీని రిలీజ్ చేయలేనంతగా.
లేడీస్ టైలర్ అంటూ అప్పట్లో తాను తీసిన సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ అంటూ.. ఫ్యాషన్ డిజైనర్ పేరుతో లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్లుగా తీస్తున్నాడు వంశీ. ఉయ్యాల జంపాలా - సినిమా చూపిస్త మావా ఫేమ్ రాజ్ తరుణ్ ఇందులో హీరో. మధుర శ్రీధర్ దీనికి నిర్మాత. ఇదే కాదు.. తను మొన్నే వెళ్లిపోయింది.. అంటూ.. అజ్మల్ - నిఖితలు జంటగా ఓ మూవీని తెరకెక్కించాడు వంశీ. దీన్ని థియేటర్లలోకి తెచ్చేందుకు కొత్త నిర్మాతలని ఒప్పించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమా పేరును 'మనసు తలుపు తట్టింది మెల్లగా' అని మార్చి, ఇప్పుడు 'వెన్నెల్లో హాయ్ హాయ్' అని మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ఫిలింస్ కాకుండా.. మనోడు 'లెటర్' అంటూ ఒక షార్టు ఫిలిం కూడా తీశాడు. ఇది కూడా త్వరలోనే రిలీజ్ అవుతోంది. ఫిలిం ఫెస్టివళ్ళను టార్గెట్ చేశారట ఈ లఘు చిత్రంతో..
ఇకపోతే ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో.. వరుసగా రెండు ప్రాజెక్టులు రిలీజ్ కావడమంటే.. చిన్న విషయం కాదు. విభిన్న దర్శకుడు వంశీ.. వీటితో సక్సెస్ రుచి చూసి.. మళ్లీ ట్రాక్ లో పడాలని, మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆశిద్దాం.