కొర‌టాల‌ - పైడిప‌ల్లికే ఎందుకిలా అవుతోంది?

Update: 2023-02-21 14:00 GMT
కొంద‌రికి కొన్ని క‌లిసి రావు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోవ‌డం కుద‌రదు. దూసుకెళ్లినా కొంద‌రికి బ్రేకులు వాటంత‌ట‌వే ప‌డిపోతుంటాయి. దేనినైనా టైమ్ డిసైడ్ చేస్తుంది. అంద‌రూ వారెన్ బ‌ఫెట్ లు ఎల‌న్ మ‌స్క్ లు టాటా బిర్లాలు అంబానీలు కాలేక‌పోయారంటే అది సృష్టి మ‌ర్మం అని విశ్లేషించాలి!  దూసుకుపోదామంటే ప్ర‌తిసారీ కుద‌ర‌దు!

టాలీవుడ్ లో ఓ ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కుల కెరీర్ జ‌ర్నీ చూస్తే.. ఆ ఇద్ద‌రికీ ఇటీవ‌ల ఎందుక‌నో బ్రేకులు ప‌డిపోతున్నాయి. ఒక‌రు వ‌రుస విజ‌యాల‌తో స‌ర్రున దూసుకొచ్చిన ద‌ర్శ‌క‌ర‌చ‌యిత కొర‌టాల కాగా.. మ‌రొక‌రు ర‌చ‌యిత‌ల‌ స్క్రిప్టుల‌పై ఆధార‌ప‌డే వంశీ పైడిప‌ల్లి. ఆ ఇద్ద‌రూ విరుద్ధ స్వ‌భావం ఉన్న‌ ప్ర‌తిభావంతులు. ద‌ర్శ‌కులుగా అగ్ర హీరోల‌తో ప‌ని చేసారు. విజ‌యాల్ని అందుకున్నారు. త‌న‌కు తానుగా స్క్రిప్టు రాసుకునే స‌మ‌ర్థ‌త దానిని విజువ‌లైజ్ చేసే ఆధిప‌త్యం కొర‌టాల‌కు ఉంది. అందుకే అత‌డు అప‌జ‌య‌మెరుగ‌ని వాడిగా ఇంత‌కాలం హ‌వా సాగించాడు. ఆచార్య విష‌యం వ‌దిలేస్తే కొర‌టాల అజేయుడే.

ఇక ఆచార్యతో ప‌రాజ‌యం ఎందుకు వ‌చ్చింది? అంటే.. అన్ని శ‌కునాలు క‌లిసి రాలేదన్న ముచ్చ‌ట ఉండ‌నే ఉంది. ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారీ పెద్ద అడ్డంకి కాగా.. ఈ సినిమా ప్రారంభోత్స‌వం మొద‌లు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల జాప్యాలు వ‌గైరా చాలా డిస్ట్ర‌బెన్సెస్ ఉన్నాయి.  క‌థానాయిక ఎంపిక పెద్ద హెడేక్ అయింది. స్క్రిప్టును రీడిజైన్ చేయ‌డం అన్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. కార‌ణం ఏదైనా కానీ కొరటాల‌కు డిలే త‌ప్ప‌లేదు. చాలా శ్ర‌మించినా చివ‌రిగా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. ఇంత‌కుముందు మిర్చితో బంప‌ర్ హిట్టు కొట్టి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో మూవీ కోసం చాలా కాలం కొర‌టాల వేచి చూశారు. చ‌ర‌ణ్ తో ప్రారంభోత్సవం చేసుకున్నాక ఆ సినిమా ఆగిపోయింది. ఆ త‌ర్వాత మెగాస్టార్ కి అయినా బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌నుకుని కొర‌టాల త‌డ‌బ‌డ్డారు. అస‌లు ఆచార్య సినిమా ప్రారంభానికి ముందే చాలా స‌మ‌యం అతడు వేచి చూడాల్సి వ‌చ్చింది. దానికి కార‌ణాలు అనేకం. ఏది ఏమైనా అజేయంగా దూసుకెళుతున్న కొర‌టాల‌కు అలా బ్రేక్ ప‌డిపోయింది.

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విష‌యంలో ప‌దే ప‌దే వాయిదాల ఫ‌ర్వం కొన‌సాగుతోంది. కొర‌టాల శివ తొలుత అనుకున్న స్క్రిప్టుకి ఆర్.ఆర్.ఆర్ అసాధార‌ణ విజ‌యంతో మారిన ఇమేజ్ దృష్ట్యా ఎన్టీఆర్ కోసం స్క్రిప్టు మార్చాల్సి వ‌చ్చింద‌ని.. కాన్వాసు ప‌రంగా పాన్ ఇండియా రేంజుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కారణం ఏదైనా ప‌దే ప‌దే ఈ సినిమా ప్రారంభోత్స‌వం వాయిదాల ప‌ర్వంలో కొనసాగుతోంది. మొన్న అమిగోస్ ఈవెంట్లో ఫిబ్ర‌వ‌రి 24న కొర‌టాల‌తో సినిమాని ప్రారంభిస్తాన‌ని ఎన్టీఆర్ ప్ర‌క‌టించినా అది ఇప్పుడు వాయిదా ప‌డింది. ఆక‌స్మికంగా తన సోద‌రుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న శివైక్యం కావ‌డంతో ఎన్టీఆర్ 30 పూజా కార్యక్ర‌మాల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో మ‌రోసారి ఈ మూవీ డిలే త‌ప్ప‌డం లేదు. కొర‌టాల‌కు మ‌రోసారి ఊహించ‌ని ఆల‌స్య‌మిది.

ఇక వంశీ పైడిప‌ల్లి విష‌యానికి వ‌స్తే.. కెరీర్ లో కేవ‌లం అగ్ర హీరోల‌తో మాత్ర‌మే సినిమాలు చేసిన వంశీ పైడిప‌ల్లి ఇప్ప‌టికే ఎన్టీఆర్ - మ‌హేష్ - చ‌ర‌ణ్ - బ‌న్ని- నాగార్జున‌ లాంటి హీరోల‌కు హిట్లిచ్చాడు. పైడిప‌ల్లి తెర‌కెక్కించిన మ‌హ‌ర్షి- బృందావ‌నం- ఎవ‌డు- ఊపిరి చిత్రాలు విజ‌యం సాధించాయి. కానీ ఏం లాభం?   సినిమా సినిమాకి మ‌ధ్య చాలా పెద్ద గ్యాప్ తీసుకుని ప‌ని చేసాడు. ద‌శాబ్ధన్న‌ర‌ కెరీర్ లో అత‌డు చేసిన సినిమాలు కేవ‌లం ఆరు. 2007లో కెరీర్ ప్రారంభించి 2023 నాటికి కేవ‌లం అర‌డ‌జ‌ను సినిమాలు మాత్ర‌మే తెర‌కెక్కించాడంటే 16 ఏళ్ల కెరీర్ లో స‌గ‌టున రెండున్న‌రేళ్ల‌కు ఒక సినిమా తీసాడు. మ‌హేష్ - నాగార్జున‌ల‌తో హిట్లు కొట్టాక కూడా రెండు మూడేళ్ల పాటు అత‌డు ఎదురు చూపులు చూసిన స‌న్నివేశం ఉంది. ముఖ్యంగా మ‌హ‌ర్షి హిట్టు అని చెప్పుకున్నాకా మ‌హేష్ కోసం చాలా వేచి చూసాడు. చివ‌రికి ఆ ప్రాజెక్ట్ కుద‌ర‌క‌పోవ‌డంతో విజ‌య్ తో వారిసు సినిమా చేసాడు. మ‌హేష్ కోసం ఆగాక ఆ త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ కోసం ఏడాది పైగానే వేచి చూడాల్సొచ్చింది.

ఒక ద‌ర్శ‌కుడి ప్ర‌యాణంలో ఏదీ అంత ఈజీ కాదు! అని అర్థం చేసుకోవడానికి ఈ రెండు ఉదాహ‌ర‌ణ‌లు చాలు. స‌క్సెస్ అందుకుని కూడా చాలా వేచి చూసారు ఆ ఇద్ద‌రూ. అగ్ర ద‌ర్శ‌కులకు ఓపిక స‌హ‌నం కూడా చాలా ఎక్కువ‌. అంత‌కుమించి కేవ‌లం అగ్ర హీరోల‌తో మాత్ర‌మే సినిమాలు చేయాల‌నే మొండి ప‌ట్టుద‌ల అద‌నం. అస‌లు ద‌ర్శ‌కుడు అవ్వ‌డ‌మే గొప్ప అనుకుంటే అగ్ర హీరోల‌తో సినిమాలు తీయ‌డం మ‌రెంతో గొప్ప‌. ఇప్పుడు కొర‌టాల తార‌క్ తో.. పైడిప‌ల్లి మ‌ళ్లీ ద‌ళ‌ప‌తి విజ‌య్ తోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ టైమ్ గ్యాప్ లు త‌ప్ప‌డం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News