ఈ ప్రపంచం నన్ను నమ్మలేదు!-పైడిపల్లి

Update: 2019-05-13 04:45 GMT
ఉన్న ఉద్యోగం వదిలేసి సినిమాలకు దర్శకత్వం వహిస్తాను అంటే అమ్మా నాన్న అంగీకరిస్తారా?  పిచ్చి పట్టిందా? అంటూ తిట్టేస్తారు. నమ్మడం చాలా కష్టం. లైఫ్ తో రిస్క్ చేయొద్దనో.. ప్రయోగాలు అసలే వద్దనో నిరాశపరుస్తారు. అయితే అలా అని ఎంచుకున్న మార్గంలోకి వెళ్లకపోతే అదో అసంతృప్తి. ఎందరో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రంగుల కలలతో సినీరంగంలో రాణించాలని ఇటువైపు వస్తున్న సంగతి తెలిసిందే. లక్షల్లో జీతాలు త్యజించి గ్లామర్ వరల్డ్ లో సత్తా చాటాలన్న పంతంతో వస్తున్నారు. అలా వచ్చిన వాళ్లలో సక్సెస్ అయ్యేవాళ్లు చాలా అరుదు. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కొందరైతే జీవితాంతం వేచి చూసే సన్నివేశం ఉంటుంది. కొందరు వెనుదిరిగి పలాయనం చిత్తగించేవాళ్లు ఉన్నారు. అంతెందుకు బుద్ధిగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వంశీ పైడిపల్లి దర్శకుడవ్వాలన్న  కలలతో ఈ రంగంలో అడుగుపెట్టారు. పెద్ద శాలరీ వదిలేసి ఈ రంగంలోకి వచ్చినప్పుడు అతడిని ఎవరూ నమ్మలేదట. ఒక్క అమ్మ తప్ప తనని ఈ లోకం నమ్మలేదని ఎంతో ఎమోషన్ అయ్యాడు మహర్షి సక్సెస్ వేదికపై. ఆయన ఆ మాట అనడం చూస్తే సాఫ్ట్ వేర్ నుంచి లేదా ఇతరత్రా రంగాల నుంచి సినీప్రపంచంలో అడుగుపెట్టిన అందరికీ చుక్కలు కనిపించి ఉంటాయనడంలో సందేహమేం లేదు.

వంశీ పైడిపల్లి ఈ రంగంలోకి వచ్చాడు. బ్లాక్ బస్టర్లు తీశాడు. కానీ ఇంకా కెరీర్ పరంగా సందిగ్ధత అలానే కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ తీసినంత మాత్రాన పట్టాభిషేకం చేయరు. మరో ఛాన్సిస్తారంతే. ఈ దఫా ఫెయిలైతే మళ్లీ మొదటికే వస్తుంది కథ. హిట్టును నమ్మే పరిశ్రమ ఇది. హిట్టిస్తాడంటేనే ఏ డైరెక్టర్ ని అయినా నమ్మి డబ్బు పెడతారు నిర్మాతలు. కోట్లలో పెట్టుబడులు వెదజల్లి జూదం ఆడేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు. అందుకే మహర్షి సినిమా కోసం పైడిపల్లి ఏకంగా మూడేళ్లు ఎదురు చూశాడు. ఊపిరి రిలీజై బ్లాక్ బస్టర్ అంటూ టాక్ తెచ్చుకున్నాక.. అతడు ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చింది. మహర్షి కథ రాసుకుని దానిని ఒప్పించేందుకే చాలా సమయం వేచి చూశాడు. మహేష్ ఒప్పుకున్న తర్వాత చేయడానికి వెయిట్ చేయించాడు. తనకోసం రెండేళ్లు వేచి చూశాడు వంశీ. అది పూర్తి చేసి రిలీజ్ చేసేప్పటికి మూడేళ్లయ్యింది. ఇంతకాలం వెయిట్ చేసే ఓపిక ఇంకొకరికి ఉంటుందా? అందుకే ఆ అలసట అంతా అతడి ముఖంలో కనిపిస్తూనే ఉంది. అంతేనా.. వీలున్న ప్రతి వేదికపైనా బరస్ట్ అవుతూనే ఉన్నాడు వంశీ. అతడిలో ఎంత పెయిన్ ఉందో మహర్షి వేదికపై కనిపించింది.

సక్సెస్ వేడుకలో వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ``నేను సాఫ్ట్‌ వేర్ జాబ్ వ‌దిలేసి పరిశ్రమకు వ‌చ్చిన‌ప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు. ఈ  ప్ర‌పంచం అస్సలు న‌మ్మ‌లేదు. కానీ మా అమ్మ‌గారు న‌మ్మారు. నేను ఈరోజు ఇక్క‌డ నిల‌బ‌డ్డానంటే కార‌ణం మా అమ్మే. మహర్షి రిలీజ్ త‌ర్వాత ఇంటికి వెళితే అమ్మ‌ నాన్న నన్ను హ‌త్తుకుని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దాని క‌న్నా విజ‌యాన్ని నేను ఇక అడ‌గ‌లేను. ఒక కొడుకుగా న‌న్ను ఇలా పెంచినందుకు అమ్మ‌కు థాంక్స్‌`` అంటూ ఎంతో ఎమోషన్ అయ్యారు వంశీ పైడిపల్లి. మహర్షి ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎంత వేచి చూస్తే ఇక్కడి దాకా రాగలిగాడు?

పైడిపల్లి గతాన్ని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఓపెన్ చేస్తే.. అశ్వినీద‌త్‌ జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి ప‌ట్టిందని .. అదే మే 9న నా సినిమా ఆయ‌న నిర్మాణంలో రావ‌డం ఆశీర్వాదంగా భావిస్తున్నానని అన్నారు.  పివిపి విడుద‌ల‌కు ముందు రోజు చెప్పిన మాట‌లు ఇంకా గుర్తున్నాయి. దిల్‌రాజు నాకు దర్శకుడిగా జ‌న్మినిచ్చారు. దిల్‌రాజు..శిరీష్‌.. ల‌క్ష్మ‌ణ్‌.. నా ఫ్యామిలీ అని తెలిపారు. ``మహేష్ తొ క‌లిసి ఆయ‌నింట్లో హోం థియేట‌ర్‌లో సినిమా చూశాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న చెప్పిన మాట‌లు గుర్తున్నాయి. వంశీ  క్లాసిక్‌ తీశావ్ అన్న మాట‌ను మ‌ర‌చిపోలేను. మ‌హ‌ర్షి ఇంత మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుందంటే 80 శాతానికి పైగా కార‌ణం మ‌హేష్‌. రైతు గురించి మేం ఏ సిస్టంను ప్ర‌శ్నించ‌లేదు. రైతు గురించి ఓ ఆర్టిక‌ల్ వ‌చ్చిన‌ప్పుడు జాలి చూపిస్తున్నాం కానీ.. ఆ జాలి ఈరోజు మ‌న మీద మ‌న‌మే చూపించుకోవాల్సిన టైం వ‌చ్చింద‌ని చెప్పే ఆలోచ‌న‌ను క్రియేట్‌ సినిమా ఇది. పరిష్కారాన్ని చూపించాం. ఎవ‌రూ చేయ‌లేని సొల్యూష‌న్స్ కాదు.. మ‌నం చేయ‌గ‌లిగే ప‌రిష్కార‌మే. మేం ఒక ఎక‌రం పొలం కొనుక్కోవాల‌నే ఆలోచ‌న‌ను క్రియేట్ చేస్తున్న సినిమా ఇది`` అన్నారు. వంశీ పైడిపల్లి కొన్ని సందర్భాల్లో కంటతడి పెట్టుకుని ఎమోషన్ అవ్వడం వేదికపై కనిపించింది.
    
    
    

Tags:    

Similar News