వాళ్లకేమీ తీసిపోనంటున్న వెంకీ

Update: 2016-06-28 15:30 GMT
రెండు మూడేళ్ల కిందట పరిస్థితి చూస్తే సీనియర్ హీరోల పనైపోయిందన్నట్లే కనిపించింది. ఐతే ఒక్కొక్కరుగా సీనియర్లు పుంజుకోవడం మొదలుపెట్టారు. బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో ఊపులోకి వస్తే.. నాగార్జున మనం.. సోగ్గాడే చిన్నినాయనా.. ఊపిరి సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. మరోవైపు చిరంజీవి రీఎంట్రీ సినిమా కూడా ఈ మధ్యే మొదలైపోయింది. ఈ ముగ్గురు హీరోలు కూడా తమ లుక్స్ విషయంలో గతంలో కంటే చాలా బెటర్ అయ్యారు. బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో సరికొత్త లుక్‌ తో అభిమానుల్ని అలరించాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం మరింత ఆకర్షణీయమైన గెటప్ లోకి మారాడు. ఇక నాగార్జున గత మూడు సినిమాల్లోనూ లుక్ విషయంలో మెప్పించాడు. ఇప్పుడు ‘ఓం నమో వెంకటేశాయ’ కోసం విభిన్నమైన లుక్ లోకి మారుతున్నాడు. ఇక చిరంజీవి సంగతేంటో మొన్న ‘కత్తిలాంటోడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలైనపుడే అందరూ చూశారు.

ఇక సీనియర్లలో మిగిలింది వెంకటేష్. విక్టరీ హీరో లుక్స్ గత సినిమాల్లో అంత గొప్పగా ఏమీ లేవు. చాలా మామూలుగా కనిపించాడు. ఐతే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాబు బంగారం’లో మాత్రం వెంకీ సూపర్బ్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి వెంకీ ఆకట్టుకుంటున్నాడు. ప్రతి పోస్టర్లోనూ చాలా గ్లామరస్ గా.. గత సినిమాల్లో కంటే యంగ్ అండ్ ఛార్మింగ్ గా దర్శనమిస్తున్నాడు. లేటెస్టుగా రిలీజ్ చేసిన కొన్ని లుక్స్ కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ‘బాబు బంగారం’లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న వెంకీ.. దానికి తగ్గట్లు మంచి ఫిజిక్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. మొత్తానికి మిగతా సీనియర్ హీరోలకు తానేమీ తీసిపోనని పోస్టర్ల ద్వారా చాటుకున్న వెంకీ.. తెర మీద ఇంకెలా కనిపిస్తాడో చూద్దాం.
Tags:    

Similar News