వెంకీ కథ మళ్లీ మొదటికి వచ్చింది

Update: 2015-10-20 09:02 GMT
ఏడాది నుంచి కొత్త సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు విక్టరీ వెంకటేష్. కానీ ఏదీ ఒక కొలిక్కి రావట్లేదు. ఓ డైరెక్టరుతో సినిమా అనుకోవడం.. కథ వినడం.. స్క్రిప్టు చర్చలు సాగించడం.. అంతా ఓకే అనుకున్నాక.. ఏదో రుచించక సినిమా క్యాన్సిల్ చేయడం.. ఇలా సాగుతోంది వరస. ఇలా ఇద్దరు ముగ్గురు వెంకీ తిరస్కరణకు గురయ్యారు. దీంతో ఓ దశలో వెంకీతో సినిమా అంటేనే యువ దర్శకులు భయపడే పరిస్థితి. ఐతే తన గురించి ఈ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోతుండటం.. ఏ ప్రాజెక్టూ ఓ కొలిక్కి రాకపోవడంతో వెంకీ ఈ మధ్య మనసు మార్చుకున్నాడట. ఇంతకుముందు చర్చలు జరిపిన దర్శకులతోనే రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడట. సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్ లోనే ఆ రెండు సినిమాలు చేయడానికి పచ్చ జెండా కూడా ఊపేశాడట.

ఈ రెండు సినిమాలు దసరా తర్వాత ఒకేసారి మొదలు కాబోతున్నట్లు సమాచారం. చాన్నాళ్ల నుంచి వెంకీని డైరెక్ట్ చేయాలని చూస్తున్న మారుతి దర్శకత్వంలో ఒక సినిమా మొదలవబోతోందట. మరోవైపు ఈ మధ్య వెంకీ తిరస్కారానికి గురైన కథతో నాగార్జునతో సినిమా తీయాలని చూసిన క్రాంతి మాధవ్ కూడా తిరిగి వెంకీ దగ్గరికే వచ్చాడట. వెంకీనే మళ్లీ అతణ్ని వెనక్కి పిలిచి ముందు అనుకున్న సినిమా చేయడానికి సరే అన్నాడట. ఈ రెండు సినిమాలు దసరా తర్వాత మొదలవుతాయని.. రెండు సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేస్తారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.
Tags:    

Similar News